ఇవాళ రాజమహేంద్రవరంలో భాజపా భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ సభలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం, కాంగ్రెస్ పతనం కావడం ద్వారా ఆ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ప్రధానంగా దృష్టి పెట్టడం అనేది వారి లక్ష్యంగా తెలుస్తున్నది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాదిన్నరగా ఎంత భారీగా సాయం చేసిందో కూడా అమిత్షా ద్వారా రాష్ట్ర ప్రజలకు వెల్లడించబోతున్నాం అంటూ స్థానిక భాజపా నాయకులు చాలా రోజులుగా ఊదరగొడుతున్నారు!
అయితే పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. తెలుగుదేశం పార్టీతో ఇప్పటికిప్పుడు సున్నం పెట్టుకోవడానికి భాజపా సిద్ధంగా లేదు. ఏపీలో అమిత్షా భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉండవచ్చు గాక.. కానీ.. వారి ఫోకస్ మొత్తం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నదనే సందేశం మాత్రమే ఇస్తారు. అయితే ప్రత్యేకంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. అమిత్షా హాజరైన వేదిక మీదనుంచి.. రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా, చంద్రబాబునాయుడును ఇరుకున పెట్టే ప్రకటనలు చేయకుండా.. ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే మాటలు మాట్లాడకుండా ముందే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.
తెదేపాతో భాజపా మిత్రపక్షమే అయినప్పటికీ… కొందరు రాష్ట్ర భాజపా నాయకులు చంద్రబాబు సర్కారును చాన్సు దొరికిన ప్రతిసారీ దారుణంగా తూర్పారపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సోము వీర్రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కృష్ణంరాజు ఇలా పలువురు నాయకులు చంద్రబాబు సర్కారును తిట్టడలో తమకంటూ ఒక ముద్ర ఏర్పాటుచేసుకున్నారు. అయితే వీరు వ్యక్తిగతంగా వేర్వేరు సందర్భాల్లో తిట్టడం వేరు. అమిత్షా హాజరైన సభావేదిక మీదినుంచి చంద్రబాబును తిట్టడం వేరు. అది ఈ రెండు పార్టీల మైత్రికి సంబంధించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించే అవకాశం ఉంది. అందుకే.. ఇలాంటి దుందుడుకు నాయకులు అందరికీ.. ముందే పార్టీ నాయకత్వం హెచ్చరికలు చేసినట్లుగా సమాచారం. రాష్ట్రానికి భాజపా మరియు కేంద్రం చేస్తున్న మేలు గురించి చెప్పడమే లక్ష్యం కావాలి తప్ప.. చంద్రబాబు ను తిట్టడం కాదనే హింట్ వారందరికీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబును పల్లెత్తు మాట తిట్టకుండా.. రాష్ట్ర సర్కారుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమిత్షా బహిరంగ సభ కేవలం ఆత్మస్తుతులతోనే ముగుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.