పులివెందుల నుంచి జగన్ రెడ్డి సీటు మారుతున్నారన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. అయితే అది ఉత్తదేనని ఎక్కువ మంది అనుకుంటున్నారు.కానీ పులివెందులలో మాత్రం… ఈ సారి జగన్ అక్కడ పోటీ చేయరని గట్టిగా నమ్ముతున్నారు. కమలాపురం లేదా జమ్మలమడుగు నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. పులివెందుల నుంచి కుటుంబంలో ఒకర్ని నిలబెట్టడం లేదా… బీసీ వర్గాలను ఆకట్టుకుంటామని బీసీని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ అంశంపై టీడీపీ నేత, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయనున్న బీటెక్ రవి కూడా స్పందించారు. ఆయన కు కూడా సమాచారం ఉందేమో కానీ.. జగన్ రెడ్డి నిన్నే నమ్ముకున్నా… పులివెందుల నుంచే పోటీ చేయి… తేల్చుకుందామని సవాల్ చేస్తున్నారు. జగన్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తే.. తనకు అక్కడ నుంచి చాన్సివ్వాలని కోరుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలోనూ టీడీపీకి మెజార్టీ వచ్చింది. కొన్ని బూతుల్లో రిగ్గింగ్ కు పాల్పడినపప్పటికీ.. టీడీపీకి మెజార్టీ రావడంతో ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా అని ఆ పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు.
అదే సమయంలో జగన్ రెడ్డి కుటుంబంలో ఏర్పడిన గొడవలు… అవినాష్ రెడ్డి వ్యవహారంపై ఎక్కువగా వ్యతిరేకత ఉండటంతో… ఇబ్బందికరంగా మారింది. మరో వైపు టార్గెట్ పెట్టుకుని కొన్ని మండలాల్లో బలోపేతం అయ్యేందుకు బీటెక్ రవి ప్రయత్నిస్తున్నారు. తీవ్రమైన పోలీసు వేధింపులు ఉన్నా ఆయన తగ్గడం లేదు. ఇది ఆయనకు మరింత సానుభూతి తీసుకు వస్తోంది.