విలన్ పాత్రలతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన నటుడు రాజనాల. తెరపై ఆయన విలనిజం ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేసింది. విలన్ పాత్రల్ని రసాత్మకంగా పోషించి ప్రతినాయకుడిగా ఒక ట్రెండ్ సెట్ చేసిన రాజనాల.. కెరీర్ చివర్లో వేషాలు లేక బాధపడ్డారనే సంగతి కొంతమందికే తెలుసు. ఆర్ధిక సమస్యలు కూడా ఆయన్ని చుట్టుముట్టాయి. అతి మంచితనం, అపాత్ర దానాలు ఆయన్ని దెబ్బతీశాయి. తన చివరి రోజుల్లో వేషాల కోసం సినిమా ఆఫీసులు చుట్టూ తిరిగారు రాజనాల.
దర్శకుడు పెద్ద వంశీ, రాజనాల గురించి చెప్పిన ఓ ఘటన వింటే కళ్ళల్లో నీళ్ళు తిరిగేస్తాయి.
వంశీ దర్శకుడైన కొత్తల్లో స్వయంగా ఆయన ఇంటికి వచ్చారట రాజనాల. తన పరిస్థితిని గురించి చెప్పుకొని.. ‘మీ సినిమాలో ఒక వేషం ఇప్పించండని’ దాదాపుగా బ్రతిమాలుకున్నారట. అంత గొప్ప నటుడు ఇప్పుడు ఇంత దయనీయమైన పరిస్థితిలో వున్నారా? అని చాలా బాధపడ్డారట వంశీ. తర్వాత ఆయన సినిమా పనుల్లో పడిపోయారు. కొన్నాళ్ళుకు స్రవంతి మూవీస్ ఆఫీస్ లో కనిపించినపుడు మరోసారి వేషం కోసం గుర్తు చేశారట రాజనాల. అయితే తన కథల్లో రాజనాలకు సరిపడే పాత్రలు కుదరక అప్పటికి వేషం ఇవ్వలేకపోయారు వంశీ.
రోజులు గడిచాయి. ఈటీవీకి ఒక సీరియల్ చిత్రీకరిస్తున్నారు వంశీ. శవం కాలుతున్న దృశ్యాన్ని చిత్రీకరించాలి. నేరుగా స్మశాన వాటిక కి వెళ్లి చిత్రీకరించారు. అక్కడే వున్న ఓ వ్యక్తితో ‘కాలుతున్న శవం ఎవరిది ? అని అడిగారట వంశీ. ‘రాజనాలది’ అని సమాధానం వచ్చింది. ఆ మాటతో నిశ్చేష్టుడై దిగ్బ్రాంతిలో వుండిపోయారట వంశీ. ” చివరికి శవం కాలే వేషం ఇచ్చాను’’ అని కన్నీటి పర్యంతమయ్యారు వంశీ. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ పంచుకున్నారాయన.