బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రెండు కంటే తక్కువ శాతం ఓట్ల తేడా ఉందని ఆ మార్పు రావడానికి ఎంతో కాలం పట్టదని బీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. కేటీఆర్ పదే పదే ఈ రెండు శాతం తేడా ఓట్ల సిద్దాంతాన్ని చెబుతున్నారు. కానీ వారు చెప్పింది నిజం కాదని.. గ్రేటర్ హైదరాబాద్ ను మినహాయిస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పది శాతానికిపైగా ఓట్ల తేడా కనిపిస్తోందని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి.
64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 92,35,792 ఓట్లు వచ్చాయి. ఇది 39.40 శాతంగా నమోదైంది. ప్రతిపక్ష బీఆరెస్‌కు 87,53,924 ఓట్ల పోలయ్యాయి. అంటే 37.35 శాతం. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తే కాంగ్రెస్‌కు 4,81,868 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చినట్లు కనిపిస్తోంది. కానీ హైదరాబాద్ రీజియన్‌లోని 25 సీట్లు మినహాయిస్తే ఉత్తర, దక్షిణ తెలంగాణలలో కాంగ్రెస్, బీఆరెస్‌కు మధ్య పోలైన ఓట్లతో భారీ తేడా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఉత్తర, దక్షిణ తెలంగాణ కలిపి కాంగ్రెస్‌కు 83,10,792 ఓట్లు వచ్చాయి. బీఆరెస్‌కు 71,76,924 ఓట్లు లభించాయి. అంటే ఈ రెండు రీజియన్లలో బీఆరెస్‌కంటే కాంగ్రెస్‌కు 11,33,868 ఓట్లు అధికంగా పోలయ్యాయి. బీఆరెస్ 25 సీట్లున్న ఒక్క హైదరాబాద్‌లో రీజియన్‌లోనే అత్యధిక స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. ఇక్కడ బీజేపీ ఒక్క స్థానం ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందాయి. హైదరాబాద్ రీజియన్‌లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 25.53 శాతం మాత్రమే. బీఆరెస్‌కు వచ్చిన ఓట్లు 38.97 శాతం. బీఆరెస్ కంటే కాంగ్రెస్‌కు 13.24 శాతం ఓట్లు తక్కువ వచ్చాయి.
అయితే 51 సీట్లున్న ఉత్తర తెలంగాణ రీజియన్‌లో కాంగ్రెస్‌కు 33 సీట్లతో 41.26 శాతం ఓట్లు వచ్చాయి. బీఆరెస్‌కు 10 సీట్లతో 34.64 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 7 సీట్లతో 15.66 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రీజియన్‌లో బీఆరెస్ కంటే కాంగ్రెస్‌కు 6.62 శాతం ఓట్లు వచ్చాయి. 43 సీట్లున్న దక్షిణ తెలంగాణలో 30 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌కు 45.86 శాతం ఓట్లు రాగా 13 సీట్లు సంపాదించుకున్న బీఆరెస్‌కు 39.29 శాతం ఓట్లు లభించాయి. కేసీఆర్‌పై వ్యతిరేకత లేనట్టయితే ఇంత తేడా ఎందుకు వస్తుందన్నది బీఆర్ఎస్లోని ఇతర నేతల నుంచి వచ్చే స్పందన.
లోపాలు సవరించుకుని ప్రయత్నిస్తే.. ముందుకు వెళ్తామని ఆత్మవంచన చేసుకుంటే.. ఇంకా ఇంకా నష్టపోతామని పలువురు నేతలు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేస్తున్నారు.