పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో నామినేటెడ్ పదవుల కోసం ఆత్రుత కనిపిస్తోంది. ఆలస్యం ఉండదని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతుండటంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ వారు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. దీంతో ఆ పోస్టులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల కోసం పలువురు నేతలు రాష్ట్ర పెద్దలతో పాటు ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
అయితే సీఎం రేవంత్ మాత్రం పైరవీలు పని చేయవని చెబుతున్నారు. పార్టీ కోసం ఎవరు పని చేశారో తన దగ్గర లెక్క ఉందని.. పని చేసిన వారికి పదవులు వస్తాయని చెబుతున్నారు. దాదాపు వందమందికిపైగా నేతలు కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. జనవరి 3న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పదవుల ప్రకటన ఉంటుందని నమ్ముతున్నారు. పార్టీ ముఖ్యమైన నేతలు అంతా కూడా నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టారు. సంక్రాంతి లోపే చాలామందికి తీపికబురు వినిపిస్తారని నమ్ముతున్నారు.
ఎమ్మెల్యే స్థాయిలో పవర్ ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇరవై, ముఫ్ఫై వరకూ ఉంటాయి. వాటి కోసం ఎక్కువ డిమాండ్ వినిపిస్తోంది. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, రైతు విభాగం. ఇలా ఏ విభాగానికీ టిక్కెట్లు దక్కలేదు. వారికి ప్రోత్సాహం ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారి కన్నా … పదేళ్లుగా కాంగ్రెస్ లో పని చేసిన వారికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.