వైసీపీ అధ్యక్షుడు జగన్ డూ ఆర్ డై తరహా గేమ్ ప్లాన్ కు తెరలేపారు. తన పార్టీ నుంచి వరసగా ఎమ్మెల్యేలు టీడీపీలోకి వలసపోతుండటంతో ఆయనకు దిక్కుతోచలేదు. ఈ వలసలకు చెక్ పెట్టడానికి భూ కుంభకోణాల కథనాలు ఉపయోగపడతాయని వైసీపీ స్కెచ్ వేసింది. జర్నలిస్టుల పరిశోధన ఆధారంగా భూముల కొనుగోలు లావాదేవీలను బయటకు తీశారు. టీడీపీ మంత్రులు, ఇతర నాయకులు డిఫెన్స్ లో పేయడానికి ప్రయత్నించారు. దీంతో కొందరు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ సంజాయిషీ ఇచ్చుకున్నారు. జరిగింది భూ కుంభకోణమా, లేక ఎవరి డబ్బులతో వాళ్లు కొనుక్కోవడమా అనేది నిలకడమీద తెలుస్తుందని టీడీపీ వారు చెప్తున్నారు.
రాజధానిలో సొంతిల్లు లేదా స్థలం ఉండాలని ఎవరైనా కోరుకుంటారని, కాబట్టి తమ పార్టీ వారు కూడా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుక్కుంటే తప్పు కాదని టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే బినామీ పేర్లతో భారీగా భూములు కొన్నారనే ఆరోపణ నిజమా కాదా అనేది తేలాల్సి ఉంది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలనేది వైసీపీ డిమాండ్. మరోవైపు, ముద్రగడ మళ్లీ నిరాహార దీక్ష చేస్తానని బెదిరించడం వెనుక జగర్ హస్తం ఉందనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల వేళ టీడీపీని గుక్క తిప్పుకోనివ్వకుండా దాడి చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
భూముల దందాల విషయంలో టీడీపీని డిఫెన్స్ లోకి నెట్టడంలో వైసీపీ సఫలమైంది. అయితే, దీనిపై సీబీఐ దర్యాప్తుకి సిఫార్సు చేయడం ద్వారా టీడీపీ పైఎత్తు వేస్తే? నింద పడింది కాబట్టి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐకి కేసు అప్పగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తే అప్పుడు వైసీపీ చేతినుంచి ఈ అస్త్రం జారిపోవచ్చు. ఇక సీబీఐ దర్యాప్తు పూర్తి కావడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు.
ముద్రగడ విషయంలో జగన్ హస్తం నిజమే అయితే అది కచ్చితంగా ఆత్మహత్యా సదృశమే. రాష్ట్రం మొత్తం మీద కాపుల కంటే బీసీ జనాభాయే ఎక్కువ. కాపులను బీసీల్లో చేర్చవద్దని ఇప్పటికే వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఒక వేళ ముద్రగడ దీక్షకు వైసీపీ మద్దతు తెలపడంతో పాటు ఆయనకు మద్దతుగా పదే పదే మాట్లాడితే బీసీలు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది ఆ పార్టీలోనే కొందరు సీనియర్ నేతల ఆందోళన. పైగా, మొన్ననే ప్రభుత్వ హామీలకు అంగీకరించి దీక్షను విరమించిన వ్యక్తి, ఇప్పుడు హటాత్తుగా దీక్షకు దిగుతాననడం ఆశ్చర్యకరం. ఈసారి ఆయన దీక్షకు అంతగా ప్రజల మద్దతు లభించక పోవచ్చని భావిస్తున్నారు. 8 నెలల్లో కమిషన్ నివేదిక, కాపు కమిషన్ కు రూ. వెయ్యి కోట్ల కేటాయింపు హామీలు గవర్నర్ ప్రసంగం ద్వారానే ప్రభుత్వం ఇచ్చేసింది. కాబట్టి ముద్రగడ దీక్షకు దిగితే, పెద్దగా ఫలితం ఉండక పోవచ్చంటున్నారు. దీక్షను ప్రభుత్వం భగ్నం చేసినా పెద్దగా వ్యతిరేకత రాదని టీడీపీ భావిస్తోంది. ఒకసారి దీక్ష భగ్నం చేసి, తన హామీల గురించి ప్రభుత్వం సవివరంగా తెలిపితే ఇక ముద్రగడ ఫ్యాక్టర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అవుతుందనేది తెలుగు దేశం ఉద్దేశం. అప్పుడు ఒక అస్త్రాన్ని వైసీపీ కోల్పోయినట్టవుతుంది.
ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలేమీ లేవు. 2019లో భూముల దందాలనే ఎజెండా చేయాలని వైసీపీ ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చు. ఒకవేళ సీబీఐ దర్యాప్తు పెండింగులో ఉంటే వైసీపీకి వాయిస్ ఉండదు. పైగా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉచిత తాయిలాలే ఎన్నికల్లో పనిచేస్తాయి. అవినీతి అనేది ఒక అంశమే కాదు. అదే అంశమైతే వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనే అభియోగంతో 10 సీబీఐ చార్జిషీట్లలో ఎ-1 ముద్దాయిగా ఉన్న జగన్ పార్టీకి 2014లో అన్ని సీట్లు వచ్చేవి కావు. అవినీతి ఆరోపణలను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని దీన్నిబట్టే స్పష్టమవుతోంది. మొత్తం మీద జగన్ మెగా వ్యూహం ఆయనకు అధికారాన్ని అందించడానికి ఉపయోగ పడుతుందా అనేది ప్రశ్న.