ఆంధ్రప్రదేశ్‌లో హైప్రోఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి టెక్కలి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను ఓడించాలన్నది జగన్ పంతం. కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం పార్టీని చిందర వందర చేస్తున్నాయి. తాజాగా ఆయన ఓ ఐఏఎస్ అధికారి పేరును తెరపైకి తెచ్చారు. దీంతో వైసీపీలోనే నాలుగు వర్గాలు తయారయ్యాయి. జగన్ రెడ్డే అచ్చెన్నకు మేలు చేస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి.
టెక్కలిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి 50 శాతానికిపైగా ఓట్లు
టెక్కలిలో 2019లో అచ్చెన్నను ఓడించాలని వైసీపీ అధినేత జగన్ చాలా పట్టుదలగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. టెక్కలి నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. నందిగాం, టెక్కలి, సంత బొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో టీడీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఊరూరా కింజరాపు కుటుంబానికి అత్మీయులు ఉన్నారు. వరుసగా 2014, 2019 ఎన్నికలలో యాభై శాతానికిపైగా ఓట్లు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలలో దువ్వాడ శ్రీనివాస్ , 2019 లో పేరాడ తిలక్ లను జగన్ బరిలోకి దింపారు. కానీ ప్రయోజనం లేకపోయింది.
దువ్వాడ కుటుంబంలో రచ్చతో తేలిపోయిన వైసీపీ
అచ్చెన్నాయుడుకి సామాజికపరంగా,, దూకుడు పరంగా దువ్వాడ శ్రీనివాసే కరెక్ట్ అభ్యర్థి అని జగన్ నిర్ణయించారు. ఆయన కూడా జగన్ ను ఆకట్టుకునేందుకు బూతులతో విరుచుకుపడేవారు. తొడలు కొట్టేవారు. కొడతాను..చంపుతాను అని అచ్చెన్నను బెదిరిస్తూ ఉండేవారు. కానీ అచ్చెన్న ఆయనను అసలు పట్టించుకోలేదు. చివరికి దువ్వాడ అక్రమ సంబందం వ్యవహారంతో పరువుపోగొట్టుకున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేసినా ఇంటి పోరు కారణంగా తాను పోటీ చేయలేనని..తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఆయన కోరిక మేరకు దువ్వాడ వాణిని ఇంచార్జ్ గా ప్రకటించారు. జడ్పీటీసీగా ఉన్న ఆమె.. పార్టీ పగ్గాలు అందుకున్నా ఏ మాత్రం బండి ముందుకు కదలడంలేదు. దాంతో కొత్త అభ్యర్థిపై సీఎం జగన్ దృష్టి సారించారు.
ఐఏఎస్‌ను సీటివ్వాలన్న ఆలోచన
కేంద్ర మాజీ మంత్రి శ్రీకాకుళం మాజీ ఎంపీ అయిన డాక్టర్ కిల్లి కృపారాణి టిక్కెట్ రేసులోకి వచ్చారు. . బలమైన కాళింగ సామాజికవర్గం ఈ సారి తమవారే ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారని వైసీపీ హైకమాండ్ కు ఐ ప్యాక్ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కానీ జగన్ ఆమె వైపు మొగ్గు చూపడం లేదు. అదే వర్గానికి చెందిన ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉన్న అరుణ్‌కుమార్‌ను జగన్ పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎలా చూసినా వైసీపీలో దువ్వాడ, పేరాడ తిలక్, కిల్లి కృపారాణి వర్గాలకు తోడుగా ఐఏఎస్ వస్తున్నారు. ఈ కారణంగా అచ్చెన్నాయుడు చాలా సేఫ్ జోన్లో ఉన్నారుని చెప్పుకుంటున్నారు.