వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో తాను ఏర్పాటు చేసిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే ఆమె ఇకపై తెలంగాణలో రాజకీయాలు చేసే అవకాశం లేదు. తెలంగాణ పార్టీని విలీనం చేసిన తెలంగాణ నుంచి ఒక్క కాంగ్రెస్ నేత కూడా రాలేదు. రేవంత్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొనలేదు. అసలు తెలంగాణ ప్రస్తావన లేకుండానే విలీనం జరిగిపోయింది.
విలీనం తర్వాత ఎక్కడ పోటీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నలకు షర్మిల క్లారిటీ ఇచ్చారు. అండమాన్ అయినా సరే పార్టీ ఇచ్చిన బాధ్యతలను పూర్తి చేస్తానన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత..ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ… అన్ని వర్గాలను కలుపుకుంటూ, అందరినీ కలుపుతూ పని చేస్తుందన్నారు. ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత నన్ను తీవ్రంగా బాధించిందని చెప్పుకొచ్చారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ నీ ప్రధానిగా చూడాలన్నది నా తండ్రి అశయమన్నారు.
విలీన కార్యక్రమంలో షర్మిలతో పాటు ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా పాల్గొన్నారు. విలీన కార్యక్రమంలో డీకే శివకుమార్ కూడా పాల్గొనలేదు. మొత్తంగా ఆమెకు తెలంగాణ రాజకీయాలతో అసలు సంబంధం ఉండదని పూర్తిగా ఏపీ రాజకీయాలకే పరిమితమని.. తొలి రోజే సంకేతాలు ఇచ్చారు.