2023 టాలీవుడ్ నిర్మాతలకు మిశ్రమ ఫలితాల్ని అందించింది. ఎప్పటిలానే 10 శాతానికి మించి సక్సెస్ రేటు లేదు. 2024లో మాత్రం నిర్మాతలకు మరిన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి. ఇప్పటికే చాలామంది నిర్మాతలు చేతులెత్తేశారు. అనుకొన్న ప్రాజెక్టులు ఆగిపోయాయి. రానున్న రోజులు… నిర్మాతలకు గడ్డు కాలమే అని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
ఓటీటీ మార్కెట్ హఠాత్తుగా పడిపోవడం, శాటిలైట్ రేట్లు గిట్టుబాటు కాకపోవడం, హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా ఆగిపోవడం… ఇవన్నీ నిర్మాతల ముందరి కాళ్లకు బంధమేసేశాయి. నాన్ థియేట్రికల్ అడ్వాన్సులతో సినిమా మొదలెట్టి, ఆ తరవాత ఫైనాన్స్ తీసుకొని, ఏదోలా సినిమా పూర్తి చేద్దామనుకొన్న నిర్మాతల ఆటలు చెల్లవు. చేతి నిండా డబ్బు ఉండి, వచ్చినా రాకపోయినా పెద్దగా ఇబ్బంది లేదనుకొన్న నిర్మాతలే ఇప్పుడు రిస్క్ చేయగలుగుతున్నారు. బడా నిర్మాణ సంస్థలు సైతం.. ఇప్పుడా పరిస్థితుల్లో లేవు. అందుకే కొన్ని క్రేజీ కాంబినేషన్లు కూడా ఆగిపోతున్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్లను అర్థాంతరంగా రద్దు చేసేశారు నిర్మాతలు. ఓటీటీలు ఇప్పుడు సినిమాల్ని కొనడం లేదు. ఏప్రిల్ – మే వరకూ ఈ పరిస్థితి కొనసాగవొచ్చు. ఆ తరవాత వాళ్లకు బడ్జెట్లు వచ్చినా, ఇది వరకటిలా భారీ మొత్తాలకు సినిమాల్ని కొనే పరిస్థితి లేదు.
గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇది వరకటిలా.. భారీ సినిమాలపై ఫోకస్ చేయకపోవడానికి కారణం ఇదే. సినిమా ఓకే అనుకొని, కొబ్బరికాయ కొట్టి, కొంత మేర షూటింగ్ జరుపుకొన్న సినిమాలు సైతం ఇప్పుడు హోల్ట్లోకి వచ్చేశాయి. కొన్ని సినిమాలు పూర్తయినా వాటికి శాటిలైట్, ఓటీటీ బిజినెస్ అవ్వలేదు. తీరా సినిమా విడుదలైన తరవాత ఎవరైనా కొంటారా, కొనరా? అనే సందేహాలు ఉన్నాయి. అందుకే ఓటీటీ మార్కెట్ మళ్లీ ఓపెన్ అయితే తప్ప, ఆయా సినిమాలు బయటకు రావు. ముఖ్యంగా చిన్న సైజు, మీడియం సినిమాలకు ఈ ఇబ్బంది ఉంది. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ పై ఆధారపడిన కొంతమంది హీరోల వైపు నిర్మాతలు కన్నెత్తి చూడడం లేదు. ఈ కారణాల వల్లే 2023తో పోలిస్తే.. 2024 సినిమాలు చాలా తక్కువ స్థాయిలో రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2023లో తెలుగు నుంచి దాదాపుగా 170 చిత్రాలొచ్చాయి. వాటి సంఖ్య ఇప్పుడు బాగా పడిపోయే ప్రమాదం ఉంది.