చిరంజీవికి ఇష్టమైన దైవం హనుమాన్. ఆయన కలలోకి రావడం వల్లే శివ శంకర వర ప్రసాద్ కాస్త చిరంజీవి అయ్యాడు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా చాలాసార్లు చెప్పుకొన్నారు. ఇప్పుడు ఆ ‘హనుమాన్’కి చిరు అండగా నిలవాల్సిన తరుణం వచ్చేసింది.
సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ‘హనుమాన్’ ఒకటి. ఈనెల 7న హైదరాబాద్ లో ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతోంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ సినిమాలో నటించిన తేజా సజ్జా చిరంజీవికి వీరాభిమాని. పైగా… తన డెబ్యూ ‘చూడాలని వుంది’తోనే జరిగింది. ఇంద్రలో బాల ‘చిరంజీవి’గా తొడ గొట్టింది కూడా తేజానే. ఆ ఎఫెక్షన్తోనే చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వస్తున్నారు.
సంక్రాంతికి థియేటర్ల పంపకంలో ‘హనుమాన్’కి అన్యాయం జరిగిందన్న మాట అందరినోటా వినిపిస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో చిరంజీవి వేదికపై ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఆయన చిన్న సినిమాలకు వకాల్తా పుచ్చుకొనేవారు. చిన్న సినిమాలకు అన్యాయం జరక్కుండా కాపాడేవారు. ఇప్పుడు ఆ బాధ్యత చిరంజీవి తీసుకొంటే బాగుంటుందని అంతా భావిస్తున్నారు. పరిశ్రమలో పెద్ద సినిమాలది, అగ్ర నిర్మాతదే రాజ్యం అనే నమ్మకాలు బలపడుతున్న ఇలాంటి తరుణంలో చిరంజీవి చిన్న సినిమాల పక్కన నిలబడితే అంతకంటే కావల్సిందేముంది?