బీఆర్ఎస్ పార్టీకి ఏదీ కలసి రావడంలేదు. ముగ్గురు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే వారు గెలిచారు. ఇప్పుడు మూడు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడేలా ఉన్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు రెండు ఖాళీ అయ్యాయి. పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచి రాజీనామా చేశారు. ఇప్పుడా స్థానానికి ఉపఎన్నికలు వచ్చాయి. రెండింటిలో ఒకటి వస్తుందని బీఆర్ఎస్ అనుకుంది. కానీ రెండు స్థానాలకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఈసీ చెప్పడంతో బీఆర్ఎస్ కు మైండ్ బ్లాంక్ అయింది.
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 18వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 29వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది.
రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలైతే పోలింగ్ ఉండదు. ఏకగ్రీవం అవుతుంది. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్కరికి 60 ఓట్లు వస్తే ఎమ్మెల్సీ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఉన్నారు. బీఆర్ఎస్కు 39 మంది మాత్రమే ఉన్నారు. అయినా ఎక్కువ స్థానాలు ఉంటాయి కాబట్టి రెండో స్థానం బీఆర్ఎస్ కు వస్తుంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఈసీ ఇచ్చింది.
రెండు స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అంటే… ఒక్కొక్కరికి ఒక్కో ఎన్నిక జరుగుతుంది. అప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు ఇద్దరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే చాన్స్ వస్తుంది. అదే జరిగితే… రెండు కాంగ్రెస్ ఖాతాలో పడతాయి. ఒక వేల ఒకే నోటిఫికేషన్ ఇచ్చినా ఎంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సపోర్టుగా ఉంటారనేది చెప్పలేం. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అవసరం అయినా రెడీగా ఉంటానని మల్లారెడ్డి, ఆయన అల్లుడు గతంలోనే ఆఫర్ ఇచ్చారు. ఆయనకు ఉన్న సమస్యలు అలాంటివి. దాదాపుగా పాతిక మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై నోరు తెరవలేకపోతున్నారు. గతంలో తమకు న్యాయంగా రావాల్సిన ఎమ్మెల్సీని దక్కించుకునేందుకు కేసీఆర్ కొనుగోళ్లు చేశారని.. రివర్స్ లో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు పెట్టారని అంటున్నారు.