క్రికెటర్ అంబటి రాయుడు కండువా కప్పుకున్న వారంలోపే రాజీనామా చేసేశారు. కండువా కప్పుకోవడానికి ముందు ఆయన చాలా చోట్ల తిరిగాడు. మొత్తం ఐ ప్యాక్ ఆయన పర్యటనల్ని.. ప్రకటనల్ని డిసైడ్ చేసింది. అంతా బాగుంది.. ఇక గుంటూరు ఎంపీగా బరిలోకి దిగడమే ఖాయమనుకున్నారు. కానీ హఠాత్తుగా సోషల్ మీడియాలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కండువా కప్పుకున్న వారంలోనే ఈ వ్యవహారం తేలిపోయింది. ఈ వారంలోనే అంబటి రాయుడికి.. తాను ఐపీఎల్ కాదు.. ఐసీఎల్‌లో చేరానని క్లారిటీ వచ్చిందని చెబుతున్నారు.
జగన్ సహ నిందితుడు శ్రీనివాసన్ కనెక్షన్‌తో వైసీపీతో టచ్‌లోకి అంబటి రాయుడు
అంబటి రాయుడు .. నేరుగా జగన్ రెడ్డితో కానీ వైసీపీతో కానీ టచ్ లోకి రాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ యజమాని.. ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులు. ఇండియా సిమెంట్స్ తో క్విడ్ ప్రో కో లావాదేవీలు ఉన్నాయి. అందులో భాగంగానే.. రాయుడిని ఆ కనెక్షన్ల నుంచి తీసుకొచ్చారు. ఐపీఎల్ లో రాయుడు పులుసు అయిపోయిందని.. ఇక వదిలించుకుందామని చెన్నై కూడా అనుకుంటున్న సమయంలోనే ఇది జరగడంతో.. ఆయనకు నేరుగా క్యాంప్ ఆఫీస్‌కు పంపించారు. ఇదేదో బాగుందనుకున్న అంబటి రాయుడు.. రాజకీయంగా అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు.
అంబటి రాయుడిపై కుల ముద్ర వేసిన ఐ ప్యాక్
అంబటి రాయుడు తమ పార్టీతో టచ్ లోకి రావడంతో ఆయన కాపు కావడంతో ఇక తమదైన రాజకీయాలను వైసీపీ ప్రారంభించింది. సొంతంగా ఏ స్టేట్మెంట్లు, ఇంటర్యూలు ఇవ్వవొద్దని ఐ ప్యాక్ చెప్పిందే చేయాలని నిర్దేశం చేశారు. అన్నట్లుగానే చేశారు. చివరికి ఆయనపైన.. కుల పిచ్చి ముద్రపడింది. అంతే కాదు మరో కులంపై దారుణమైన వ్యాఖ్యలు చేయించారు. మొత్తంగా ఆయన ఇమేజ్ ను నాశనం చేసే దిశగా రాజకీయం చేస్తూండటంతో… .. మెల్లగా ఆయనతో అసంతృప్తి బయటపడినట్లుగా కనిపిస్తోంది.
గెలవలేని గుంటూరు సీటుతో నాకేద్దామని ప్లాన్ చేశారని భయం
గుంటూరు సీట్ ఇస్తామని చెబితే గెలుస్తారని భ్రమ పడ్డారో.. పెట్టారో కానీ.. ఎంపీ లావు కృష్ణదేవరాయులు.. పోటీ చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పిన తర్వాత అంబటి రాయుడుకు.. తనను బలి పశువును చేయబోతున్నారన్న అంశంపై స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. రాయుడికి రాజకీయాలు పెద్దగా తెలియవు. వైసీపీలో పాలన గురించి ఆయనకు సరైన ఫీడ్ బ్యాక్ వచ్చిందో రాలేదో కానీ.. గుంటూరులో పోటీ చేస్తే పరువు పోతుందని తెలియడంతో.. ఆయన ఆగిపోయారని అంటున్నారు.
మొత్తంగా వారం రోజులకే.. వైసీపీ అంటే ఏమిటో తెలిసిందని.. అక్కడ దొరికితే నమిలిపడేస్తారని అర్థం కావడంతో.. వేగంగానే ఆ విష కౌగిలి నుంచి బయటపడ్డారని చెబుతున్నారు