రామ్చరణ్ – ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, వృద్ది సినిమాస్ సంస్థలు ఈ ప్రాజెక్ట్ కోసం మైత్రీతో చేతులు కలిపాయి. ఈ చిత్రానికి రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెహమాన్ తో బుచ్చిబాబు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలెట్టాడు. అయితే ఈరోజు రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా రెహమాన్ని స్వాగతిస్తూ చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే రెహమాన్ మూడు ట్యూన్లు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
సుకుమార్ రైటింగ్స్ అనగానే దేవిశ్రీ ప్రసాద్ గుర్తొస్తాడు. ‘ఉప్పెన’ సినిమా విజయవంతం అవ్వడానికి దేవి సంగీతం ఓ ప్రధాన కారణం. రామ్ చరణ్ – దేవిశ్రీలదీ సూపర్ హిట్ కాంబోనే. మరి ఈసారెందుకో రెహమాన్ వైపు మొగ్గు చూపించారు. ఇదో స్పోర్ట్స్ డ్రామా. నేపథ్యం కూడా కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ కోసం రాసుకొన్న కథ ఇది. ఆ తరవాత చరణ్ దగ్గరకు వెళ్లింది. ఈనెలలోనే లాంఛనంగా షూటింగ్ మొదలెడతారు. వేసవిలో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.