కేసీఆర్ దాదాపుగా ప్రతి రోజూ ఓటమికి కారణాలను వెదుక్కుంటూనే ఉన్నారు. అది కూడా పూర్తిగా ఎమ్మెల్యే.లపైనే నెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేదని మరోసారి వ్యాఖ్యానించారు. జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని పేర్కొన్నారు. బహుశా ఆయన ఉద్దేశం సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌ను మారుస్తామని చెప్పడం కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట ఓ వంతు సీట్లు గెలిచామని.. అప్పుడు కాంగ్రెస్ కు ఓటేసిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని చెప్పారు. కాంగ్రెస్ హామీలను అమలు చేసేలా ఒత్తిడి తేవాలని.. ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా పలు సూచనలు చేశారు.
ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్టుగా ఉన్నప్పుడు యాభై మంది ఎమ్మెల్యేలను మారుస్తామని హడావుడి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన సీట్లు లభించవని సర్వేల ఆధారంగా సీట్లు ఇస్తామని చెప్పారు. అయితే ఎమ్మెల్యేలంతా పదేళ్లుగా అధికారంలో ఉన్న వారు కావడం.. ఆర్థికంగా బలోపేతం కావడంతో.. సీట్లు మార్చినా ఇతర పార్టీలకు వెళ్లడమో లేకపోతే.. రెబ ల్స్ గా మారి పోటీ చేయడమో చేస్తారన్న ఉద్దేశంతో ఆగిపోయారు. ఇప్పటికీ తమ ఓటమికి కారణాలుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను చెప్పుకుంటున్నారు.
అయితే స్వయంగా కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓడిపోయారన్న విషయాన్ని నెటిజన్లు ఎక్కువగానే గుర్తు చేస్తున్నారు. వీలైనంతగా తమపైన.. కేసీఆర్ పైన వ్యతిరేకత లేదని చెప్పుకునే ప్రయత్నంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలనే ఎక్కువగా బద్నాం చేస్తున్నారు.