ఆంధ్రప్రదేశ్‌లోని వీఐపీ నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి ఓడిపోయిన ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జెండా పాతడమే కాదు.. ఎవరూ పీకలేనంతగా పాతుకుపోయారు. ప్రజల్లో కలిసిపోయే ఆయన శైలి.. అవినీతి అనే మాటే వినిపించని తీరు .. సమస్యలపై తక్షణం స్పందించే గుణం ఆయనను రాజకీయంగా బలపరిచాయి. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఏ ఒక్క నేత కూడా నిలబడలేకపోతున్నారు. ఈ సారి జనసేన పొత్తు ఆయనకు అదనపు బలం. వైసీపీకి బలమైన నేత కరువయ్యారు.
పాలకొల్లు నిమ్మల అడ్డా
కాపు సామాజిక వర్గానికి కేరాఫ్ అడ్రస్ గా పాలకొల్లు నిలుస్తోంది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రామానాయుడు.. వ్యక్తిగతంగా కష్టించి పనిచేయడంతోనే 2019లో వైసీపీ హవాలోనూ గెలవగలిగారు. 2024లో కూడా మళ్లీ గెలుస్తామని ధీమా ప్రదర్శిస్తోంది టీడీపీ. ఎమ్మెల్యే రామానాయుడు. ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేస్తున్నారు.
ప్రభుత్వం కంట్లో నలుసులా మారిన రామానాయుడిని కట్టడి చేయాలని వైసీపీ కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కానీ ఎవరూ బలంగా లేరు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవూరు శ్రీనివాస్ జోరుగా తిరుగుతున్నారు. నియోజవర్గ ఇన్చార్జిగా ఉన్న శ్రీనివాస్ జడ్పీ చైర్మన్ గాను పనిచేశారు.
జనసేన నిమ్మలకు అదనపు బలం
పార్టీ బలంతో పాటు నిమ్మలకు వ్యక్తిగతంగా రాజకీయ అభిమానం ఏర్పడింది. అలాగే.. ఈ సారి ఆయనకు జనసేన బలం కలసి రానుంది. ఈ నియోజకవర్గంలో కాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మరోవైపు జనసేనాని పవన్‌కు వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి 32 వేల ఓట్లు తెచ్చుకున్నారు. కాపు సామాజికవర్గంలో చాలా వరకూ ఓట్లు జనసేనకే పడ్డాయి. అయినా టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడుకు 17వేల ఓట్ల మెజార్టీ వచ్చింది.. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి… పాలకొల్లులో ఏకపక్ష విజయం ఖాయమని లెక్కలుచెబుతున్నాయి.
రామానాయుడు అసలైన పొలిటికల్ లీడర్
రాజకీయ పార్టీల బలాలకు.. నాయకుడి పనితీరు కూడా కలసి వస్తే ప్రజలు మార్పు కోసం ఆలోచించే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితిని నిమ్మల రామానాయుడు కల్పిస్తున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే రాజకీయాల్లో గెలుపోటములు ప్రజల చేతుల్లో ఉంటాయి. ఎలాంటి నేతనైనా ఓడించిన సందర్భాలు ఉన్నాయి. నిమ్మల అజేయడుని చెప్పలేం కానీ.. ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ ఆయనకే ఉందని నియోజకవర్గంలో ఏకాభిప్రాయం ఉంది.