కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో ఎన్ని వందల కోట్లు అయినా సరే ఖర్చు పెట్టి వైసీపీని గెలిపించాలని టాస్క్ ఇచ్చారేమో కానీ మంత్రి పెద్దిరెడ్డి మాత్రం కిందా మీదా పడుతున్నారు. కానీ ఆయన నియోజకవర్గాల్లో వర్గ పోరాటాలు కవర్ చేసుకోవడానికే ఆయనకు సమయం సరిపోవడం లేదు. తాజాగా హిందూపురంలో ఆయన ఏకంగా ఆరు రోజుల పాటు బస చేసి నేతలందర్నీ ఏకతాటిపైకి తేవాలని అుకుంటున్నారు.
సోమవారం నుంచి ఆరు రోజుల పాటు నియోజకవర్గంలో పట్టణం నుంచి పంచాయితీ వరకు కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ కలవనున్నారు. మండలానికి రెండు రోజుల చొప్పున కేటాయించి ఆరు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గత 20 రోజుల నుంచి మంత్రి వ్యక్తిగత కార్యదర్శి తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు నియోజకవర్గంలో ఉన్న నేతలందరినీ కలిశారు. ఇటీవల దీపికారెడ్డి అనే నేతను ఇంచార్జుగా పెట్టారు. కానీ ఆమె పనితీరుపై నమ్మకం కుదరలేదు. దీంతో అందరితో మాట్లాడి పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి ఆరు రోజులు మకాం వేస్తున్నారు. నవీన్ నిశ్చల్ తో పాటు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రస్తుత సమన్వయకర్త దీపిక అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి కూడా టికెట్ కోసం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తున్నట్లు స్పష్టం కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త దీపికకు ఇవ్వరని తేలిపోయింది. నందమూరి బాలకృష్ణకు ఎవరు గట్టి పోటీ ఇస్తారన్న కోణంలో కూడా తాజాగా సర్వే చేస్తున్నారు. పెద్దిరెడ్డి ఏకంగా ఆరు రోజుల పాటు మకాం వేయాలని నిర్ణయించడంతో బాలకృష్ణ ముందుగానే నియోజకవర్గానికి వచ్చారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు హిందూపురం పురపాలక సంఘం, రూరల్ మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.