ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఫోన్ హ్యాక్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చాలా కంగారు పడిపోతున్నారు. తన ఫోన్కు అమ్మాయిల వీడియోలు వస్తున్నాయని..లింకులు పంపుతున్నారని చెప్పుకొచ్చారు. రాచమల్లు రెడ్డి బాధ చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏపీలో వైసీపీ నేతల ఫోన్లను అయినా.. టీడీపీ నేతల ఫోన్లను అయినా ట్యాప్ చేసేది ఒకరే. ఆ విషయం అందరికీ తెలుసు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చెప్పారు.
మరి ఇప్పుడు రాచమల్లు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారన్నది సస్పెన్స్ గా మారింది. తన ఫోన్ ను హ్యాక్ చేయడానికి ఆస్ట్రేలియా సంస్థతో కొందరు ఒప్పందం చేసుకున్నారని తన ఫేస్ బుక్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని ఆయన భయపడిపోతున్నారు. తన పేరుతో అమ్మాయిల వీడియోలు పోస్ట్ చేస్తున్నారని అన్నారు. కొంత డబ్బులు కూడా చెల్లించారని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆ వ్యక్తి గురించిన సమాచారం పోలీసులకు ఇచ్చానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఇటువంటి కుట్రలే జరుగుతున్నాయని అనుమానంగా ఉందని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తన ముబైల్కు అమ్మాయిల వీడియో లింక్లు పంపుతున్నారని చెప్పారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన బాగోతం ఏదో లీక్ అయిందన్న డౌట్ ఉందని అందుకే తెగ కంగారు పడిపోతున్నారని కడప జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన పై అనేక రకాల ప్రచారాలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో జరిగే గుట్కా – మట్కా మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది. బెంగళూరులో దొంగనోట్లు చెలామణి చేస్తూ ఆయన అనుచరురాలు ఒకరు దొరికిపోయారు. చివరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కొట్టేసిన విషయంలోనూ.. ప్రొద్దుటూరు మూలాలు బయట పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు తన బాగోతం అంతా బయకు వస్తుందని ఆయన కంగారు పడుతున్నట్లుగా ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.