మోకాలికి బొడిగుండుకి ముడి పెట్టడం అంటే ఇదే. కొడుకు పోకిరి వేషాలు వేసి అడ్డంగా దొరికిపోతే అది కూడా ప్రతిపక్ష నేత జగన్ చేసిన కుట్ర అంటూ మంత్రి రావెల సమర్థించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవగింపు పుట్టిస్తున్నాయి. మన తెలుగు సినిమాలలో అడ్డంగా దొరికిపోయిన విలన్లు దాని గురించి చెప్పుకోవడానికి అడ్డగోలుగా ఇదంతా నాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర… అంటూ చెప్పే పస లేని డైలాగులను రావెల వ్యవహారం గుర్తుకు తెస్తోంది.
మంత్రి కొడుకు తాగిన మత్తులో ఒక వివాహితను వేధించడం, పర్యవసానంగా అరెస్టు కావడం అందరికి తెలిసిందే. ఇప్పటిదాక దొరికిన సాక్ష్యాధారాలను బట్టి రావెల కిషోర్ పుత్ర రత్నం సుశీల్ అంత సులువుగా బయటపడే అవకాశం కనిపించడం లేదు. అయితే సీసీ కెమెరాల ఫుటేజి సహా దొరికిపోతాడని మంత్రిగారు ఊహించినట్లు లేదు. కేసు గురించి మీడియాలో వార్తలు రాగానే ఇలాంటి తప్పులు ఎవరు చేసినా తాను ఖండిస్తానని మంత్రి రావెల చెప్పుకున్నారు.
ట్విస్టు ఏమిటంటే.. సీసీ కెమెరాల ఫుటేజి బయటకు రాగానే ఆయన స్వరంలో మార్పు వచ్చింది. దాని నుంచి తప్పించు కోవడం సాధ్యం కాదని అర్ధం అయిపోయిందో ఏమో గాని, అది మార్ఫింగ్ చేసిన ఫుటేజి అని ఇప్పుడు సెలవిస్తున్నారు. ఒక వైపు తన కుమారుడి పోకిరి వేషాలకు బలైన వివాహిత ఫాతిమా తన కూతురి లాంటిదని అంటూనే.. కొడుకు నిర్దోషిగా బయటకు వస్తాడని అంటున్నారు.
రాజకీయ ప్రత్యర్ధి అయినందుకు జగన్, తన పిల్లాడి జీవితాన్ని నాశనం చేసేలా ఇలాంటి కుట్రలు చేయడం కరెక్టు కాదు అంటున్నారు. కొడుకును దారిలో పెట్టుకోలేని తండ్రి.. ఇప్పుడు జగన్ మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే.. జనం నవ్వుతారని కూడా భయపడుతున్నట్లు లేదు.