కాళేశ్వరంపై న్యాయవిచారణ చేయిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్డిని కేటాయించాలని ప్రభుత్వం అధికారికంగా లేఖ ద్వారాకోరింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలక వ్యక్తి ఎవరు..? ఏం చేశారు..? కాంట్రాక్టు ఎలా ఫైనల్ అయ్యింది..? అనే అంశాలపై విచారణ చేయాలని జ్యూడిషియల్ ఎంక్వైరీలో భాగంగా ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇలాంటి వాటికి హైకోర్టు న్యాయమూర్తుల్ని కేటాయిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ చేయించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ పని ప్రారంభించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆఫీసుతో పాటు మొత్తం పన్నెండు చోట్ల సోదాలు చేశారు. కాళేశ్వరం రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరంలో అవినీతి బయట పెట్టడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ముఖ్యం. ఈ ప్రాజెక్టులో అవినీతిని వెలికి తీసి ప్రజలకు పంచుతామని రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుండి అవినీతిపై కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు అవినీతిని బయట పెట్టాల్సి ఉంది. మరో వైపు బీజేపీ కూడా కాళేశ్వరంపై అవినీతిపై విచారణను తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
దమ్ముంటే సీబీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తోంది. సీబీఐకి ఇస్తే రెండు రోజుల్లో విచారణ ప్రారంభిస్తామని ఒత్తిడి తెస్తోంది. అయితే అయితే కాళేశ్వర అవినీతి వ్యవహారం సీబీఐ చేతికి వెళ్తే.. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయి.. నీరు గారుస్తుందని .. మొత్తం అవినీతిపై తమకు సమాచారం ఉంది కాబట్టి.. తామే విచారణ చేయించాలని కాంగ్రెస్ సర్కార్ అనుకుంటోంది. జ్యూడిషఇయల్ విచారణ ద్వారా ప్రజలకూ నమ్మకం ఉంటుందని భావిస్తోంది.