సంక్రాంతి పండగ ఘట్టమనేని హీరోలకు బాగా కలిసొచ్చింది. కృష్ణ, మహేష్ బాబు కెరీర్ లో మర్చిపోలేని హిట్లు సంక్రాంతి సీజన్లోనే వచ్చాయి. ఈ పండక్కి మహేష్ నుంచి `గుంటూరు కారం` వస్తోంది. ఈసారి కూడా రీ సౌండ్ గట్టిగానే ఉంటుందని, బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం ఖాయమని అభిమానులకు మాట ఇచ్చేశాడు మహేష్ బాబు. ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మహేష్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ అని, ఈ సారి హిట్టు కొట్టడం ఖాయమని, అయితే ఈసారి నాన్నగారు లేకపోవడం ఒక్కటే పెద్ద లోటని భావోద్వేగ భరితంగా చెప్పాడు మహేష్. ”ప్రతిసారీ నా సినిమా విడుదల అవ్వగానే నాన్నగారి నుంచి ఫోన్ వచ్చేది. కానీ ఈసారి ఆయన్నుంచి ఫోన్ రాదు. ఇక మీదట అభిమానులే చేయాలి. అభిమానులే నాకు అమ్మ.. అభిమానులే నాకు నాన్న.. అభిమానులే నాకు అన్నీ..” అంటూ ఎమోషనల్ అయిపోయాడు మహేష్. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఏదో ఓ మ్యాజిక్ జరుగుతుందని, ఈసారీ ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు మహేష్. ఈ సందర్భంగా త్రివిక్రమ్ కి కృతజ్ఞతలు తెలిపాడు.
శ్రీలీల గురించి కూడా మహేష్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. శ్రీలీలతో డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదని, హీరోలకు తాట తీరిపోతుందని కితాబు ఇచ్చాడు. ఓ తెలుగు అమ్మాయి ఇంత పెద్ద హీరోయిన్ అవ్వడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. తమన్ ఇచ్చిన పాటలకూ మహేష్ ఫిదా అయిపోయాడు. కుర్చీ మడతపెట్టి అనే ఐడియా చెప్పగానే తమన్ పాట ఇచ్చేశాడని, మరో డైరెక్టర్ అయితే పది వెర్షర్లు అంటూ టైమ్ తీసుకొనే వారని చెప్పాడు మహేష్.