ఎన్నికల సంఘం చీఫ్ సహా ఫుల్ బెంచ్ ఏపీకి వచ్చి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా పాత విషయాలన్నింటినీ బయటకు తీసి ” జగన్ రెడ్డి సర్వీస్ అధికారుల్ని ” పూర్తి స్థాయిలో నిలదీసింది. మూడు జిల్లా ఎస్పీలు, ఆరేడు జిల్లాల కలెక్టర్లపై మండిపడింది. ఓటర్ల జాబితా అవకతవకలు సహా అనేక అంశాలపై ఘాటు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈసీ స్పందన చూసి.. దాదాపుగా అధికారులంతా.. ఠారెత్తిపోయారు. తమ రికార్డు అంతా ఉన్నందున ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తమ పరిస్థితేమిటన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
సాధారణంగా ఇలా ఈసీ రాష్ట్రానికి వచ్చినప్పుడు అధికారులు పక్షపాతంగా ఉన్నారని భావిస్తే.. ఎన్నికల కోడ్ రాగానే అలాంటి వారందర్నీ… ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని శాఖలకు బదిలీ చేస్తుంది. తెలంగాణలో మరీ తీవ్రంగా కాకపోయినా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటారని భావించిన అందర్నీ ఎన్నికలకు దూరం చేసింది. ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ రిమార్క్స్ పడిన వారందరికీ బదిలీలు తప్పవన్న వాదన వినిపిస్తోంది.
ఎన్నికల సంఘం పని తీరుపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకలా.. మరికొన్నిరాష్ట్రాల్లో మరొకలా వ్యవహరిస్తారన్న ఆరోపణలు కూడా గట్టిగానే వస్తూంటాయి. మరి ఏపీ విషయంలో ఎలా ఉంటారో కానీ.. సమీక్షలో చూపించినంత కఠినత్వం ఎన్నికల నిర్వహణలో చూపిస్తే.. ఈసీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది.