రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఓ స్థానం నుంచి టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పి తమ దారి తాము చూసుకుంటారో అంచనా వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే పది మంది గుడ్ బై చెప్పేశారు. వారు వేరే వారికి ఓటేస్తారా… ఓటింగ్ కు హాజరు కారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వం మళ్లీ రాదని ఎక్కువ మంది నమ్ముతూండటంతో… టీడీపీతో టచ్ లోకి వెళ్లిపోతున్నారు.
ప్రభుత్వం మారితే వైసీపీ చేసిన కక్ష సాధింపుల పాలన వల్ల జగన్ రెడ్డి ఎంత ఫలితం అనుభవిస్తారో కానీ.. అంతకు మించి వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలకు నరకం కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు… సైలెంట్ అయిపోవడమే కాదు.. టీడీపీతో టచ్ లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయలో రాజ్యసభ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. టీడీపీకి ఇప్పటికే మద్దతు పలికిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేస్తే.. నలుగుర్ని తగ్గించవచ్చని జగన్ రెడ్డి అనుకున్నారు. కానీ తమకు మద్దతుగా ఉన్న ఐదుగురిపై అనర్హతా వేటు వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
వైసీపీలో చేరిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఓ జనసేన ఎమ్మెల్యేపై కూడా అనర్హతా వేటు వేయాలని స్పీకర్‌కు టీడీపీ, జనసేనలు ఫిర్యాదు చేయనున్నాయి. ఈ నలుగురిపై వేటు వేసి.. ఆ ఐదుగురని వదిలిస్తే.. స్పీకర్ తీరుపై విమర్శలొస్తాయి. కోర్టులో పిటిషన్లు పడతాయి. అప్పుడు పరువు పోతుంది. పోవడానికి కొత్తగా ఏముందని అనుకుంటే తాము చేయాలనుకున్నది చేస్తారు. కానీ ఇప్పుడు స్పీకర్ కు కూడా టిక్కెట్ నిరాకరిస్తున్నారు. ఆయనకూ పౌరుషం ఉంటుంది కదా అన్న చర్చ వస్తోంది.