‘ఏజెంట్’ సినిమాతో ఓ డిజాస్టర్ని మూటగట్టుకొన్నాడు సురేందర్ రెడ్డి. అయితే… డీలా పడిపోలేదు. వెంటనే కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. పవన్ కల్యాణ్ – సూరి కాంబో ఇంకా ఆన్ లోనే ఉంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఈ కాంబోకి బ్రేకులు పడ్డాయి. ఈలోగా మరో సినిమా చేయడానికి సూరికి ఛాన్స్ దొరికింది. అందుకే ఈసారి విక్రమ్ కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇటీవల విక్రమ్ కి ఫైనల్ నేరేషన్ ఇచ్చాడట సురేందర్ రెడ్డి. సూరి చెప్పిన కథతో విక్రమ్ ఇంప్రెస్ అయ్యాడని, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. స్క్రిప్టు పనులు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. ఓ మంచి డేట్ చూసుకొని, ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించడమే మిగిలివుంది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నట్టు తెలుస్తోంది. కథ పరంగా.. మరికొంత మంది క్రేజీ నటీనటులు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నారు. వాళ్ల వివరాల్ని సైతం చిత్రబృందం ఎప్పటికప్పుడు ప్రకటించనుంది. విక్రమ్ సినిమా అనగానే గెటప్పులు గుర్తొస్తాయి. తన కెరీర్లో విక్రమ్ వేయని గెటప్ లేదు. కాకపోతే ఈ సినిమాలో మాత్రం గెటప్పుల జోలికి వెళ్లకూడదని సూరి నిర్ణయించుకొన్నాడట. మరి విక్రమ్ ని ఆయన ఏ రేంజ్లో చూపిస్తాడో..?!