తెలంగాణ సమాజంలో కోదండరాంకు ఉన్న ఇమేజిని ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయంపై హైకమాండ్‌కు నివేదిక ఇచ్చారు. వారి నుంచి అనుమతి రాగానే తన తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటాలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి కోదండరాంకు ఇవ్వడం ఖాయమయింది. రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆయనను మంత్రిని చేయాలని కోదండరాం అనుకుంటున్నారని చెబుతున్నారు. దీనికి కోదండరాం కూడా అంగీకరించారని అంటున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర కీలకం. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. కానీ జరిగిన పోరాటాన్ని బీఆర్ఎస్ మాత్రమే క్యాష్ చేసుకుంది. తర్వాత కోదండారంకూ దిక్కు లేకుండా పోయింది. ఆయనకు సికింద్రాబాద్ లోక్ సభ టిక్కెట్ ఓ సారి… ఎమ్మెల్సీ ఇస్తామని ఓ సారి ఆఫర్ చేసినా తిరస్కరించారు. కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్పుకున్నారు. కానీ ఆయన తర్వాత సొంత పార్టీ పెట్టుకుని విఫలమయ్యారు. ఓ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో భాగంగా పోటీ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు.
పదవుల కోసం అయితే కేసీఆర్ వెంటే ఉండేవారని.. ఆయన తెలంగాణ బాగు కోసమే పని చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన సేవలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కోదండరాంను మంత్రిని చేస్తే.. బీఆర్ఎస్ పై నైతికంపై పైచేయి సాధించినట్లవుతుంది.