విజయవాడ రేసులోకి సుజనాచౌదరి వచ్చారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తానని సుజనా చౌదరి ఢిల్లీలో ప్రకటించారు. పొత్తులపై త్వరలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. విజయవాడనుంచి బీజేపీ పోటీ చేస్తే గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు. అమరావతే ఏపీ రాజధానిగా ఉంటుందని..మా అధిష్టానం కూడా అమరావతికి అనుకూలమేనన్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికల పై బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఏపీ లో ఈ సారి ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరుగుతాయి .. ఎన్నికల కమిషన్ బీజేపీ ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
సుజనా చౌదరి కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఏపీలోనూ ఎక్కడైనా పర్యటించినట్లుగా కనిపించలేదు. పురందేశ్వరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించిన తర్వాత కూడా కనిపించలేదు. సీఎం రమేష్ అప్పుడప్పుడూ పార్టీ వ్యవహారాల్లో కనిపిస్తున్నారు. గతంలో అమరావతి ఉద్యమం కోసం కాస్త గట్టిగానే సాయపడిన సుజనా ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు .. ఎన్నికల సమయంలో మరోసారి తాను పోటీ చేస్తానంటూ తెరపైకి వచ్చారు. సుజనా చౌదరి ఇంత వరకూ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. తెర వెనుక వ్యవహారాలు చక్క బెట్టడంలో కీలక పాత్ర పోషించడంతో చంద్రబాబు ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారు.
గత ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో ఆయనదే కీలక పాత్ర. అయితే టీడీపీ ఓటమి తర్వాత అందరూ కలిసి బీజేపీలో చేరిపోయారు. పొత్తుల గురించి మాట్లాడుతున్నారంటే.. బీజేపీ పొత్తులు పెట్టుకుని విజయవాడ తీసుకుంటే.. పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.