పాలక- ప్రతిపక్షాల్లో కారకులు ఎవరైనా కావొచ్చు గానీ.. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించినంత వరకు ఎంతో కీలకం అయిన అసెంబ్లీ సమావేశాలు మాత్రం.. ప్రతిసారీ మంటగలిసిపోతున్నాయి. సభ మొదలుకాగానే.. ప్రతిపక్షాలు తమ వాయిదా తీర్మానాలు తీసుకోవాలంటూ.. పట్టుపట్టడం.. ఇక ఏ వ్యవహారమూ ముందుకు సాగకుండా.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ సభా పర్వం పూర్తయిపోతుండడమూ గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి.. ప్రశ్నోత్తరాలు, శూన్యగంట పూర్తయిన తర్వాత మాత్రమే వాయిదా తీర్మానాలు అంటూ… బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనది.
శీతాకాల సమావేశాలు గుర్తున్నాయా..? ప్రశ్నోత్తరాలు అని గానీ, జీరో అవర్ అనిగానీ వ్యత్యాసాలు ఏమీ లేవు.. ప్రతిరోజూ సెషన్ మొదలు కాగానే రభస.. తమ వాయిదా తీర్మానంమీద చర్చ జరగాలంటూ గొడవ. అసలు ఏరోజూ ఏమీ జరగకుండానే.. అన్నిరోజులూ గడచిపోయాయి. నియోజకవర్గాల్లో తమ సమస్యల గురించి ఎమ్మెల్యేలు ఏదో చేసేస్తారని, సభలో మాట్లాడేస్తారని.. జనం కొన్ని భ్రమల్లో ఉంటారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా.. సభలో జనం సమస్యల్ని మాట్లాడేయాలని ఆరాటంతో నోటీసులు ఇస్తుంటారు. కానీ ఎవ్వరికీ ఎలాంటి వ్యవధి దక్కదు. ప్రభుత్వ బిల్లులను చివరలో ఆమోదించడం మాత్రమే జరిగింది. నిజానికి ఇలాంటి పోకడ వల్ల ప్రజలకు చాలా అన్యాయం జరిగినట్లు లెక్క.
అయితే ఈదఫా బీఏసీ సమావేశంలో ఇరుపక్షాలూ ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సభలో జీరోఅవర్, క్వశ్చన్ అవర్ ముగిసే దాకా వాయిదా తీర్మానాల గురించి మాట్లాడరాదని సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. జగన్ అండ్ కో కూడా దీనికి అంగీకరించినట్లే వార్తలు వచ్చాయి. అదే నిజమైతే.. శుభపరిణామమే. కనీసం ఈ సెషన్ అయినా.. కొన్ని ప్రజలకు సంబంధించిన చర్చలు జరుగుతాయని అనుకోవచ్చు. అయితే ఇదే సమయంలో యనమల వేసిన ఒక సెటైర్‌ను కూడా గుర్తు చేసుకోవాలి.
ప్రతిసారీ వాయిదా తీర్మానాల పేరిట రభస చేస్తూ ఉండే వైకాపా సారధి జగన్ ఈసారి సభలో కాస్త అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉన్నదంటూ.. బీఏసీలో ప్రస్తావించారుట. దానికి యనమల స్పందిస్తూ.. మీరు మంచి బాలుడిలాగా ఉంటే.. అన్నీ అర్థవంతంగా జరుగుతాయి అన్నారుట. ‘మంచి బాలుడు’ అనగా సర్కారుకు జై కొట్టేవాడు అని యనమల మీనింగేమో మనకు తెలియదు గానీ.. మొత్తానికి జగన్ అండ్ కో సహకరిస్తే సభలో చర్చల వల్ల కాస్త ఉపయోగం ఉండొచ్చు.