గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని, మహేష్ గత సినిమాల రికార్డులన్నీ ఈ సినిమా బద్దలు కొడుతుందని ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో జోస్యం చెప్పారు దిల్ రాజు. ఈ సినిమాని ఆయన నైజాంలో పంపిణీ చేశారు కూడా. అయితే.. దిల్ రాజు జోస్యం తప్పింది. ఈ సినిమాపై అన్ని చోట్ల నుంచీ నెగిటీవ్ రివ్యూలు వచ్చాయి. మహేష్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసి పెదవి విరుస్తున్నారు. మహేష్ బాగా చేశాడు. తన ఎనర్జీ సూపర్. కానీ కథ, కథనాల్లోని లోపం ఈ సినిమాకి శాపంగా మారింది. రివ్యూలన్నీ అవే చెప్పాయి. అయితే నెగిటీవ్ రివ్యూలు `గుంటూరు కారం` విజయాన్ని ఆపలేవంటున్నారు దిల్ రాజు.
ఈ సినిమాని నెగిటీవ్ రివ్యూలు వచ్చిన మాట నిజమే అని అంటున్నారు. ఆయన దగ్గరా కొంతమంది సినిమా యావరేజ్ గా ఉందని చెప్పార్ట. దిల్ రాజు దగ్గరే సినిమా యావరేజ్ అన్నారంటే, అసలు టాక్ ఏమిటో ఆయన గ్రహించలేనిది కాదు. అయితే.. ఫ్యాన్స్ షో చూసినవాళ్లు సినిమా బాగోలేదని చెబుతున్నా, మెల్లమెల్లగా మంచి టాక్ వస్తోందంటున్నారు దిల్ రాజు. నెగిటీవ్ టాక్ తెచ్చుకొన్న సినిమాలు గతంలో కొన్ని బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకొన్నాయని, ఈ సినిమా కూడా అలానే నిలబడిపోతుందని అంటున్నారు. సంక్రాంతికి పోటీ ఎప్పుడూ ఉంటుందని, ఈ నాలుగు రోజులూ గడిచాకే.. సినిమా హిట్టా, ఫట్టా అనేది తేలుతుందని, ఇప్పటికీ తనకు సినిమాపై నమ్మకం ఉందని చెబుతున్నారు దిల్ రాజు.
గుంటూరు కారంకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ తప్ప, ప్రమోషన్లు ఏం చేయలేదు, వచ్చిన టాక్ చూస్తుంటే… ఈ సినిమాకి సక్సెస్ మీట్ కూడా కష్టమే అనిపిస్తోంది.