సినిమాకు దర్శకుడే కెప్టెన్. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి వాళ్లు కెప్టెన్లు అయితే – వాళ్ల సినిమాలో హీరో ఎవరైనా సరే, బాధ్యతలన్నీ వాళ్లే మోయాలి. సినిమా హిట్టయినా, పోయినా – క్రెడిట్ వాళ్లు తీసుకోవాల్సిందే. త్రివిక్రమ్ బ్రాండ్ ప్రభావం ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ‘గురూజీ’ అనే కిరీటం నెత్తిమీద పెట్టింది వాళ్లే. త్రివిక్రమ్ ఫ్లాప్ సినిమాల్లోనూ ఆణిముత్యాల్లాంటి డైలాగులు ఏరుకొని, వాటినే మననం చేసుకొంటారు. థియేటర్ల దగ్గర డిజాస్టర్ అయిన ‘ఖలేజా’ని ఆ తరవాత టీవీల్లో తెగ చూసి, క్లాసిక్‌గా మార్చింది వాళ్లే. త్రివిక్రమ్ సినిమా హిట్టయితే.. అదంతా త్రివిక్రమ్ వల్లే అన్నంత పేరు తెచ్చుకోగలరు. అలాంటప్పుడు సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆ భారాన్ని, చేసిన తప్పుల్నీ ఆయనే మోయాలి.
‘గుంటూరు కారం’ విషయంలో వేళ్లన్నీ త్రివిక్రమ్ వైపే చూపిస్తున్నాయి. తప్పు లేదు. ఎందుకంటే ఈ సినిమా కోసం మహేష్ చేయాల్సిందంతా చేశాడు. తన లుక్ బాగుంది. పాత్రలో ఇమిడిపోయిన విధానం బాగుంది. గుంటూరు యాస బాగుంది. తన ఎనర్జీ మరీ బాగుంది. అన్నింటికంటే.. డాన్సులు బాగా చేశాడు. మహేష్‌కి డాన్సులు రావు.. అని హేళన చేసే యాంటీ ఫ్యాన్స్‌కి గట్టి సమాధానం చెప్పాడు. ఈ సినిమా విషయంలో మహేష్ చేసిన తప్పేమైనా ఉందీ అంటే… ఇలాంటి కథని ఎంచుకోవడం ఒక్కటే.
మహేష్ స్టామినాకు సరిపడ కథ కాదిది. పాటలూ, ఫైట్లూ, కమర్షియల్ ఎలిమెంట్స్.. అన్నీ కేవలం మహేష్ అభిమానుల్ని సంతృప్తి పరచడానికి తీసుకొచ్చి పేర్చారు. దాంతో అసలు కథ అటెక్కింది. అక్కడక్కడే కథని తిప్పిన ఫీలింగ్ వచ్చింది. హీరో క్యారెక్టర్ మినహాయిస్తే మరే పాత్రనీ దర్శకుడు పట్టించుకోలేదు. మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్ని ‘పనిమనిషి’లా తీర్చిదిద్దితే.. శ్రీలీల పాత్రని అర్థం పర్థం లేకుండా మలిచాడు,. ఇక ‘కుర్చీ మడతపెట్టి’ అనే పదం చుట్టూ త్రివిక్రమ్ ఎన్ని విమర్శలు మోయాల్సివచ్చిందో..? అది చాలదన్నట్టు పాత పాటల్ని, మీమ్స్‌ని వాడుకొన్న పద్ధతి చూస్తే.. ‘ఇది త్రివిక్రమ్ సినిమానేనా’ అనే అనుమానాలు వచ్చాయి. ఓ పాటలో మహేష్ లుంగీ ఊడబీకించడం.. ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చలేదు. దీనిపై కూడా ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి.
నిజానికి ఈ సినిమాకి ముందు నుంచీ ఏం కలసి రాలుదు. ఓ షెడ్యూల్ తీశాక కథ మారిపోయింది. దాంతో ఓ ఫైట్‌ని పక్కన పెట్టేశారు. హీరోయిన్ జంప్ అయ్యింది. కెమెరామెన్ మారాడు. టీమ్ లో కొన్ని కీలకమైన మార్పులు జరిగాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో పెడితే, అది కాస్త కాన్సిల్ అయ్యింది. ఇలా రకరకాల సమస్యలు. ప్రమోషన్లపై కూడా టీమ్ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు రిజల్టే తేడా వచ్చేసింది. ‘అల వైకుంఠపురములో’ హిట్ అయినప్పుడు బన్నీ కంటే ఎక్కువ క్రెడిట్ త్రివిక్రమ్‌కి వెళ్లింది. అప్పుడు ఆ విజయానికి త్రివిక్రమ్ ఎంత అర్హుడో… ఇప్పుడు ఈ ఫలితానికి గురుజీ అంతకంటే ఎక్కువే అర్హుడు. కాబట్టి.. ఈ భారాన్ని మోయక తప్పదు.