మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రెండు, మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ ను కలిసి జనసేనలో చేరే అవకాశం ఉంది. బాలశౌలి సీఎం జగన్ కు సన్నిహితుడు. వ్యాపార భాగస్వామి. వైఎస్ హయాంలోనూ ఆయన ఓ సారి ఎంపీగా ఉన్నారు. స్థానికేతుడు అయినప్పటికీ మచిలీపట్నం సీటు ఇచ్చి ఎంపీగా గెలిపించారు. ఇటీవల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో విందు ఇచ్చారు. ఈ విందుకు వెళ్లిన వారిలో బాలశౌరి ఉన్నారు. తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లారని జగన్ ఎంపీలపై మండిపడ్డారు.
బాలశౌరిపై ఇంకా ఎక్కువగా మండిపడ్డారని చెబుతున్నారు. తర్వాత మచిలీపట్నం టిక్కెట్ కోసం ఇతరుల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ పరిణామాలతో మనస్తాపం చెందిన ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పాలని అనుకున్నారు. పవన్ కల్యాణ్ ను ఇప్పటికే రహస్యంగా కలిశారని అంటున్నారు. శుక్రవారం సాయంత్రం పవన్ తో భేటీ జరిగిందని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. సీటు ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టతకు రాలేదు.
వైసీపీ నుంచి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయిన వారు గుడ్ బై చెబుతున్నారు. జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదేమైనా వ్యూహమా అని జనసైనికులు కూడా ఆలోచిస్తున్నారు. ఇలాంటి నేతల్ని చేర్పించి అధిక సీట్లు డిమాండ్ చేయించి.. పొత్తు లేకుండా చేయడమో..చివరికి వివాదాలు సృష్టించడమో చేస్తారన్న అనుమానాలు జనసైనికుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ సారికి పవన్ తో ఐదేళ్లు కలిసి నడిచిన వారికి చాన్సివ్వాలన్న అభిప్రాయం ఎక్కుువగా వినిపిస్తోంది.