ప్రశాంత్ వర్మ ‘హను- మాన్’ సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రివ్యూలు అన్నీ యునానిమస్ గా సూపర్ హిట్ అని తేల్చాయి. ప్రతి ఆటకి జనం పెరుగుతున్నారు. థియేటర్స్ కూడా పెంచే ఛాన్స్ పుష్కలంగా వుంది. పండక్కి పిల్లలు పెద్దలు అందరూ చూడగలిగే కంటెంట్ ని ఇవ్వడం పెద్ద ప్లస్ అయ్యింది. పైగా సినిమాలో డివైన్ టచ్ బావుంది. అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో హనుమాన్ నామస్మరణ మారుమ్రోగుతోంది.
అంతా బావుంది కానీ.. హనుమాన్ జీవిత చరిత్ర, రామాయణంపై అవగాహన వున్న ప్రేక్షకులకు ఇందులో పెద్ద పజిల్ లే పెట్టాడు ప్రశాంత్ వర్మ. రామాయణాన్ని మళ్ళీ గుర్తు చేసుకునే అంశాలు ఇందులో రెండు వున్నాయి. మొదటిది.. హనుమ, విభూషణుడి కథ. రావణుడి తమ్ముడు విభూషణుడు. రావణ సంహారం తర్వాత విభూషణుడు లంకకు రాజౌతాడు. ఆయనకు పట్టాభిషేకం చేయించేది స్వయంగా శ్రీరాముడే. విభూషణుడు కూడా శ్రీరామని పట్టాభిషేకానికి వస్తాడు. పట్టాభిషేక సమయంలో అతనికోక విగ్రహం ఇవ్వడం, అది శ్రీరంగంగా కొలువుదీరడం.. ఇవన్నీ ఇతిహాసాలపై పట్టువున్నవారికి తెలుసు.
అలాగే రామాయణంలో హనుమంతుడికి విభూషణుడి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు వున్నాయి. హనుమ రావణుడి వద్దకు వెళ్ళినప్పుడు.. దూతని సంహరించకూడదని రావణుడిని మందలించాడు విభూషణుడు. అప్పుడే హనుమకు విభూషణుడిపై సదాభిప్రాయం కలిగింది. తర్వాత రాముడి వద్దకు విభూషణుడు శరణుకోరి వచ్చినపుడు.. రాముడు హనుమ అభిప్రాయం అడుగుతారు. శరణుగోరి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వడం ధర్మం అని తన అభిప్రాయాన్ని చెబుతారు హనుమ.
అయితే ‘హను మాన్’ లో ఓ కొత్త కోణం ఎత్తుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. విభూషణుడి రాజ్యపాలనలో హనుమంతుడు ఒక సలహాదారుగా వున్నారని, అతని సలహాలు, సూచనలు మేరకు విభూషణుడు రాజ్యపాలన చేశాడనే కోణంలో చిత్రీకరించాడు. అసలు ఈ కోణం రామాయణంలో ఎక్కడా లేదు. హను మాన్ చరిత్ర కోణంలో చూసుకున్నా..అలాంటి పురాణం ఎక్కడా నిక్షిప్తం అయినట్లు లేదు.
రెండో అంశం ఏమిటంటే.. ‘శ్రీరామునికి హనుమ ఇచ్చిన మాట’.. ఈ మాటతోనే సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ఇది కూడా ఎక్కడా ప్రచారంలో లోని కోణమే. శ్రీరామునికి హనుమ ఇచ్చిన మాట ఏమిటనే ఆసక్తి కొద్ది కొంతమంది పండితులని అడిగితే.. ”వాల్మీకి రామాయణంలో అలాంటి ఘట్టం ఏమీ లేదండీ. బహుసా పుక్కిటి పురాణం కావచ్చు”అనే సమాధానం వినిపిస్తోంది.
నిజానికి శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత రామాయణం పూర్తయిపోతుందని చాలా మంది పండితుల వాదన. ఉత్తరకాండని అసలు వాల్మీకి రాయలేదని అవన్నీ ఎడిషనల్స్ అని కొందరు బుతారు. అయితే ఉత్తరకాండలో కూడా ఈ కోణాలు లేవు.
ప్రశాంత్ వర్మకి ఇతిహాసాలు మీద పట్టువుంది. అది ఆయన స్వతహాగా కల్పించిన పురాణం కాకపోవచ్చు. రామాయణం ఆధారంగా చాలా కథలు ప్రచారంలో వున్నాయి. అందులో చాలా వరకూ వాల్మికీ రామాయణంలో లేనివే అని చెబుతారు. హనుమ- విభూషణుడు నేపధ్యం కాస్త కొత్తగానే వుంది. సప్త చిరంజీవులనే ఒక పురాణం కోణం వుంది. ఇందులో హనుమతునితో పాటు విభీషణుడు కూడా వున్నారు. ఆ కోణంలో ఏదైనా పురాణ కథని నుంచి ఇది స్ఫూర్తి పొందివుండవచ్చు. లేదా మరేదైనా కథ కావచ్చు. మొత్తానికి పెద్దగా ప్రచారం లేని కథా వస్తువునే ఆసక్తికంగా పట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ 2 కూడా వుంది కాబట్టి.. అందులో తను ఎంచుకున్న పురాణ కథ గురించి సమగ్రంగా చెప్పే అవకాశం వుంది.