తెలుగుదేశం, జనసేనల్లోకి వస్తామంటూ వెల్లువలా ప్రతిపాదనలు వస్తున్నాయి. జగన్ రెడ్డి వ్యాపార భాగస్వాములు, ఆయన అంతరంగీకులు అనుకున్న వారు కూడా ఇలాంటి ప్రతిపాదనలు పంపుతున్నవారిలో ఉంటున్నారు. అక్కడ సినిమా అయిపోయిందని పక్క ధియేటర్లో కర్చీఫ్ వేసుకున్నట్లుగా చాలా మంది వ్యవహారం ఉంటోంది. అయితే ఈ విషయంలో టీడీపీ, జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి.
జగన్ రెడ్డి రాజకీయాల గురించి తెలిసిన వారు కోవర్ట్ ఆపరేషన్లు చేస్తారని గట్టిగా నమ్ముతున్నారు. వచ్చే వారిలో ఎంత మంది కోవర్టులు .. నిజంగా ఎంత మంది తమ పార్టీలో చేరేందుకు వస్తున్నారన్నదానిపై క్లారిటీకి రావడానికి టీడీపీ, జనసేన అగ్రనేతలు ఇబ్బంది పడుతున్నారు. నిశితంగా పరిశీలించిన తరవాతనే స్పష్టతకు రావాలని అనుకుంటున్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తనంతటకు తాను జనసేనలో చేరిపోతున్నట్లుగా ప్రకటించుకున్నారు. కానీ పవన్ వైపు నుంచి.. జనసేన వైపు నుంచి సందన రావాల్సి ఉంది.
ఇలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని.. అయితే ఈ సారి అత్యంత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. ఉమ్మడి కూటమి బలానికి తోడు సొంత బలం జత చేసే కీలక నేతలు వస్తే మాత్రం ఆహ్వానించాలని పార్టీ మీద ఆధారపడే పరాన్న జీవులను మాత్రం దూరం పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు అలాంటి వాళ్లు బేషరతుగా పార్టీలోకి వస్తామన్నా ఆలోచిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీనే నమ్ముకుని ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారు.