శర్వానంద్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో 2017 లో వచ్చిన ‘శతమానం భవతి’ మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి కుటుంబకథా చిత్రాలు ఎంతటి గొప్ప మ్యాజిక్ చేస్తాయో చూపించింది. రెండు పెద్ద సినిమాల మధ్యలో విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. కుటుంబ కథ, ఆహ్లాదకరమైన పాటలు, తెలుగుదనం ఉట్టిపడే చిత్రీకరణతో అందరినీ అలరించింది. ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని దిల్ రాజు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అయితే ఇప్పుడా సీక్వెల్ పై ప్రకటన వచ్చింది. సంక్రాంతి సందర్భంగా శతమానం భవతి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. ‘శతమానం భవతి నెక్స్ట్ పేజి’ అనే పోస్టర్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. వచ్చే సంక్రాంతికి కలుద్దామని రిలీజ్ టైం కూడా చెప్పారు. నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు ప్రస్తుతానికి పోస్టర్ లో లేవు. మొత్తానికి తన బ్యానర్ లో సంక్రాంతి హిట్ గా నిలిచిన సినిమాకి సీక్వెల్ ని పట్టాలెక్కించబోతున్నారు దిల్ రాజు. రిలీజ్ డేట్ కూడా చెప్పేయడంతో నెక్స్ట్ సంక్రాంతి ఎన్ని పెద్ద సినిమాలు వున్నా.. శతమానం భవతి నెక్స్ట్ పేజీ థియేటర్స్ కి వచ్చేయడం ఖాయం.