వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే..బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక షరతు పెట్టారని ఆయన కొడుకు ప్రకటించారు. ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని తన తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని ప్రణీత్ రెడ్డి అన్నారు. వాటి కోసమే ఆయన వేచి ఉన్నారని.. రెండు రోజుల్లో రూ.170 కోట్లు విడుదలవుతాయనే సమాచారం ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత తన తండ్రి ఒంగోలు వచ్చేస్తారని ప్రణీత్ రెడ్డి మాట్లాడారు. ఒంగోలులో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
ఈ సంబరాలకు కూడా బాలినేని ఒంగోలు రాలేదు. ఏటా ప్రతి సంక్రాంతికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలోనే ఉంటూ వేడుకలు జరుపుకునేవారు. ఈసారి మాత్రం దూరంగా ఉన్నారు. కొంత కాలంగా సొంత నియోజకవర్గం ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేరు. హైదరాబాద్ లోనే ఉంటున్నారు. గుంటూరు కారం సినిమా చూసేందుకు ఏఎంబీకి అర్థరాత్రి షోకు వెళ్లారు. గత డిసెంబర్ 12న బాలినేని తన పుట్టిన రోజు వేడుకలను నియోజకవర్గంలోనే నిర్వహించారు. ఆ తర్వాతి రోజు నుంచి ఒంగోలులో అందుబాటులో ఉండడం లేదు. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం మూడు రోజుల పాటు విజయవాడలోనే ఉన్నా .. జగన్ పట్టించుకోకపోవడంతో అలిగివెళ్లిపోయారు.
నిజానికి తన సొంత నియోజకవర్గంలో ఇళ్లస్థలాలు ఇప్పించడంతో పాటుగా.. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో, కొత్త ఇంఛార్జిల నియామకాల్లో తన మాట చెల్లుబాటు అవ్వాలనేది బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావనగా ఉంది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికే మళ్లీ టికెట్ ఇవ్వాలని బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ తామిద్దరమే ఆ స్థానాల నుంచి పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. కానీ, జగన్ మాత్రం మాగుంటకు టికెట్ నిరాకరిస్తున్నట్లు చెప్పేశారు. మాగుంట ఏం చేస్తారనేది ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.