సీఐడీ చట్ట విరుద్ధంగా కేసులు పెట్టిందని తనకు 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక జడ్జి సీఐడీ కేసులు చట్ట విరుద్ధమని చెబితే.. మరో న్యాయమూర్తి చట్ట సవరణ తర్వాత నమోదైన కేసులకే వర్తిస్తుందని.. అనుమతులు తీసుకోనందున రిమాండ్ రిపోర్టును క్వాష్ చేయలేమని తీర్పు చెప్పారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పు చెప్పినందున తాము విస్తృత ధర్మాసనానికి కేసును రిఫర్ చేస్తున్నామని ప్రకటించారు. కేసును సీజేఐకి పంపారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చంద్రబాబు కేసుల క్వాష్ పిటిషన్పై తీర్పును సీజేఐ పరిగణనలోకి తీసుకుని విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ధర్మానసం ముందు కూడా వాదనలు వినిపించాల్సి ఉంటుంది. రెండు వర్గాలు వాదనలు వినిపించిన తర్వాత త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది. అక్కడ భిన్నాభిప్రాయాలు వచ్చినా.. తీర్పు ఏదో ఓ వైపు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆ తీర్పు ఎంత కాలానికి వస్తుందని చెప్పడం కష్టమే. వచ్చే రెండు, మూడు నెలల్లో విస్తృత ధర్మాసనం వాదనలు పూర్తి కావడం.. తీర్పు రావడం కష్టమని అంచనా వేస్తున్నారు.
వాదనలు పూర్తయిన తర్వాత దాదాపుగా మూడు నెలల తర్వాత ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ క్రమంలో చంద్రబాబుకు ఒక్క ఫైబర్ నెట్ కేసుల్లో మినహా మిగిలిన అన్ని కేసుల్లోనూ ముందస్తు బెయిల్ వచ్చింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ ముందస్తు బెయిల్ పై విచారణ జరగాల్సి ఉంది. క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది. ఇప్పుడు ఆ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి పంపినందున.. ఆ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపే అవకాశం ఉంది.