మీ బిడ్డ మీ బిడ్డ అంటూ జగన్ రెడ్డి బహిరంగసభల్లో చెవుల్లో సీసం పోసినట్లుగా ప్రతి మాటకు ముందు వెనుకా అరుస్తూ ఉంటారు. కానీ ఆ బిడ్డ తల్లిని వదిలించుకుని చాలా కాలం అయింది. ఆ బిడ్డకు ఇప్పుడు మరో కష్టం వచ్చింది. ఇప్పుడు ఆ తల్లి బిడ్డకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. పిల్లలిద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు. తన అవసరం షర్మిలకు ఎక్కువగా ఉంది కాబట్టి వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశానని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు షర్మిల ఏపీకి వచ్చేశారు. జగన్ రెడ్డి బలంపైనే గురి పెట్టారు. ఇప్పుడు కూడా విజయమ్మ కూతురివైపే ఉండే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు విజయమ్మ కూతురు వైపే మొగ్గు చూపారు. కూతురుకు అండగా నిలవడమే ప్రాధాన్యతాంశంగా తీసుకున్నారు. జగన్ రెడ్డి ఇంటికి వెళ్లడం లేదు. షర్మిల తన కుమారుడి పిలుపు కోసం వెళ్లినప్పుడు కూడా విజయమ్మ షర్మిల వెంట వెళ్లలేదు. షర్మిల ఏపీకి వచ్చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిలను కట్టడి చేయాలని విజయమ్మపై జగన్ ఒత్తిడి తెచ్చారన్న ప్రచారం జరిగింది. లకానీ విజయమ్మ అలాంటి ప్రయత్నం చేయలేదని జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థం అవుతుంది.
షర్మిల వైపే విజయమ్మ నిలబడితే జగనుకు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా విజయమ్మ తటస్థంగా ఉంటారని వైసీపీ వర్గాలు నమ్ముతున్నాయి. కానీ ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు. రెండు, మూడు సార్లు షర్మిలతో కనిపిస్తే.. కుమార్తెకే ఆమె మద్దతు ఉన్నట్లుగా తేలుతుంది.