హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచినా బంద్ కొనసాగించాలని వామపక్షాలు నిర్ణయించాయి. ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోమాత్రమే జీతాలు పెంచిందని, రాష్ట్రవ్యాప్తంగా పెంచాలని డిమాండ్ చేశాయి. ఇప్పటికే కొందరు కార్మికులు విధులలో చేరిఉండగా సమ్మెలో ఎంతమంది కొనసాగుతారో తెలియకుండా ఉంది. ఆ పర్యవసానమో, ఏమోకానీ హైదరాబాద్ నగరంలో బంద్ ప్రభావం పెద్దగా కనిపించటంలేదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగానే నడుస్తున్నాయి. పెట్రోల్ బంకులుకూడా పనిచేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ పార్టీల గ్రేటర్ నాయకులుమాత్రం కార్మికులకు మద్దతుగా జోరుగా ధర్నాలు చేస్తున్నారు. వీరిని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు ఊహించనివిధంగా జీతాలు పెంచారని, కార్మికులుకూడా దానిపై సంతోషంగా ఉంటే కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఓవరాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు.