చిన్న సినిమా సత్తా మరోసారి ‘హనుమాన్’తో తెలిసొచ్చింది. కంటెంట్ ఉంటే – స్టార్లు అవసరం లేదని ‘హనుమాన్’ నిరూపించింది. ‘హనుమాన్’ పార్ట్ 2 ఉందని ముందు నుంచీ చిత్రబృందం చెబుతూనే ఉంది. దానికి తగ్గట్టుగానే క్లైమాక్స్ డిజైన్ చేశారు. క్లైమాక్స్‌లోని హనుమంతుడి షాట్స్.. గూజ్బమ్స్ తెప్పించాయి. సెకండ్ పార్ట్ వేరే లెవల్లో ఉంటుందన్న భరోసా కల్పించింది. ‘హనుమాన్’ కనీవినీ ఎరుగని స్థాయిలో విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2పై అంచనాలు మరింతగా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ‘హనుమాన్ 2’ కంటెంట్ ని ప్రశాంత్ వర్మ సిద్ధం చేశాడట.
‘హనుమాన్’లో స్టార్లెవరూ లేరు. హనుమంతుడే పెద్ద స్టార్. కాకపోతే ఆ పాత్రని గ్రాఫిక్స్‌లో డిజైన్ చేశారు. కానీ పార్ట్ 2లో ఆ పాత్రని పూర్తి స్థాయిలో చూపించాలి. అందుకోసం ఓ స్టార్ హీరో కావాలి. హనుమంతుడి పాత్ర కోసం ఓ పెద్ద హీరోని రంగంలోకి దించాలన్నది ప్రశాంత్ వర్మ ప్లాన్. అది అతిథి పాత్రే.. కానీ కథకు కీలకం. హనుమాన్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించినా ‘నో’ అని చెప్పే అవకాశం లేదు. ‘హనుమాన్’లో విలన్ పాత్ర కాస్త బలహీనంగా ఉందన్న మాట వినిపించింది. పార్ట్ 2లో ఆ తీరబోతోందని తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం కూడా ఓ హీరోని ఎంచుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడట. ‘హనుమాన్’ అంతా అంజనాద్రి అనే కల్పిత ప్రాంతంలో జరిగిన కథ. కేవలం ఓ ఊరికే పరిమితమైంది. ఈసారి స్పాన్ పెరగబోతోంది. హనుమాన్ లో వేలమందితో ఓ యుద్ధం జరగబోతున్నట్టు కొన్ని షాట్స్ లో చూపించారు. ఆ సీక్వెన్స్… ‘హనుమాన్ 2’ లో ఉండబోతోంది. వార్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హాలీవుడ్ సినిమాని తలదన్నేలా తీర్చిదిద్దాలనుకొంటున్నాడు ప్రశాంత్ వర్మ,. హనుమాన్ కేవలం రూ.27 కోట్లతో పూర్తయ్యింది. పార్ట్ 2కి అంతకు రెండింతలు బడ్జెట్ కేటాయించడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి.. హనుమాన్ 2కి బడ్జెట్ సమస్యలు కూడా లేనట్టే.