పవన్ కల్యాణ్ లో నటనే కాదు. చాలా కోణాలున్నాయి. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ పవన్‌కు పట్టుంది. తనలో కథకుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ అందరూ ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా… గాయకుడు కూడా. తన సినిమాల కోసం అప్పుడప్పుడూ పవన్ గొంతు సవరించుకొంటుంటాడు. జానపద శైలిలో సాగే పాటలంటే తనకు మరింత ఇష్టం. పవన్ పాటలన్నీ దాదాపుగా పాపులర్ అయినవే. ఇప్పుడు ‘ఓజీ’ కోసం పవన్ మరోసారి గొంతు సవరించుకొంటున్నట్టు టాక్.
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పవన్ సినిమాలకు తమన్ సంగీతం అందించడం కొత్తేం కాదు. కాకపోతే పవన్‌తో పాటేం పాడించలేదు. ఆలోటు.. ‘ఓజీ’తో తీరబోతోందని తెలుస్తోంది. ‘ఓజీ’లో పవన్ పాడదగ్గ పాట, అలాంటి సందర్భం కుదిరాయని, పవన్ కూడా ఈ పాట పాడడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ‘ఓజీ’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా గ్లింప్స్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఆ గ్లింప్స్‌కి తమన్ అందించిన నేపథ్య సంగీతం మరింత ప్లస్ పాయింట్ గా మారింది. ఇప్పుడు పవన్ పాట కూడా పాడేస్తే ‘ఓజీ’కి మరింత నిండుదనం సమకూరడం ఖాయం.