నయనతార 75వ సినిమా ‘అన్నపూర్ణి’. ఈ సినిమా తన కెరీర్లో ఓ మైలు రాయిలా ఉంటుందని భావించింది నయనతార. అయితే… ఎప్పుడూ లేనంతగా ఈ సినిమా విమర్శల పాలైంది. హిందూ మత విశ్వాసాల్ని ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు కించపరిచేలా ఉన్నాయని కొన్ని సంఘాలు గోల గోల చేశాయి. దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై నిరసనలు వ్యక్తం అయ్యాయి. కొన్ని పోలీస్ స్టేషన్లలో నయనతారపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తలనొప్పి భరించలేక `అన్నపూర్ణి` సినిమాని నెట్ ఫ్లిక్స్ సంస్థ తొలగించింది. దాంతో… వివాదం సద్దుమణిగినట్టైంది అనుకొన్నారంతా. కానీ.. అలా జరగడం లేదు. ఎవరో ఒకరు ఈ సినిమాని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. కానీ విచిత్రంగా తమిళ దర్శకులు, రచయితలు, నిర్మాతలూ.. ‘అన్నపూర్ణి’కి మద్దతుగా ముందుకు రావడం లేదు. నిజానికి తమిళ చిత్రసీమల సమష్టితత్వం ఎక్కువగా కనిపిస్తుంది. సినిమాకి కష్టం వస్తే.. వాళ్లంతా ఏకం అవుతారు. ‘అన్నపూర్ణి’ విషయంలో అలాంటి అలజడి కనిపించలేదనుకొంటున్న తరుణంలో… దర్శకుడు వెట్రిమారన్ గళం విప్పారు.’అన్నపూర్ణి’కి సపోర్ట్ చేస్తూ.. మాట్లాడారు.
‘అన్నపూర్ణి’ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ తొలగించడం ఆరోగ్యకరమైన పరిణామం కాదన్నారు. ఓ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇస్తూ, ప్రదర్శనకు అనుమతి ఇచ్చినప్పుడు దాన్ని ఏ మీడియంలో అయినా ఎలా అడ్డుకొంటారని ప్రశ్నిస్తున్నారు వెట్రిమారన్. ఇది సినిమాని మాత్రమే కాదని, సెన్సార్ బోర్డు అధికారాన్ని అడ్డుకొన్నట్టే అని అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చిత్రసీమ ఏకం కావాల్సిన అవసరాన్ని వెట్రిమారన్ గుర్తు చేస్తున్నారు. వెట్రిమారన్ గళం విప్పడంతో ఇప్పుడు తమిళ చిత్రరంగం కూడా మెల్లగా స్వరం పెంచడానికి సిద్ధం అవుతోంది. వాతావరణం చూస్తుంటే.. ‘అన్నపూర్ణి’ గోల ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. కాకపోతే ఇప్పటి వరకూ నయనతార గానీ, దర్శకుడు గానీ, ఈ వివాదం విషయంలో నోరు మెదపలేదు.