తిరుపతి ఉపఎన్నికల్లో చేసిన తప్పులకు ఇప్పుడు చిత్తూరు కలెక్టర్ మెడకు చుట్టుకుంది. సునాయసంగా గెలిచే సీటులోనూ లక్షల దొంగ ఓట్లు వేసుకున్నారు వైసీపీ నేతలు., ఆ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అ భ్యర్థి కూడా పోటీ పడ్డారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి కలెక్టర్ గిరీషా దొంగ ఓట్లు వేయడానికి సహకరించారని తేలడంతో సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులపై వేటు పడనుంది.
అయితే ఇప్పుడు ఐఏఎస్ గిరీషాపై వేటు వేసింది అయిపోయిన ఎన్నికలకు సంబంధించి. కానీ ఇప్పుడు ఓటర్ల జాబితా అక్రమాలపై ఒక్కొకటి బయటకు వస్తున్నాయి. కలెక్టర్లు అడ్డగోలుగా ఓటర్ల జాబితాలను మార్చేందుకు సహకరిస్తున్నారు. ఎస్పీలు గ్రౌండ్ వర్క్ చేయడానికి సహకరించారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఇటీవల సమీక్ష సందర్భంగా ఈసీ నేరుగానే హెచ్చరించారు. పలువురు ఎస్పీలు, కలెక్టర్లను హెచ్చరించింది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ రాగానే సగం మందిని విధుల నుంచి తప్పించడమో… సస్పెండ్ చేయడమో జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఓటర్ల జాబితా విషయంలో అక్రమాలపై టీడీపీ, జనసేన తీవ్రంగా పోరాడుతున్నాయి. ఏ మాత్రం తేడా ఉన్నా తుది జాబితా రాగానే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ సానుభూతిపరులు అన్న కారణంగా ఓట్లు తొలగించడం దొంగ ఓట్లు నమోదు చేయడం వంటివి చేశారు. దీనికి కలెక్టర్లు, పోలీసులు సహకరించారు. కొంత మంది దిగువ స్థాయి ఉద్యోగులపై ఇప్పటికే కేసులు పెట్టారు. ముందు ముందు వీరందరికి శంకరగిరి మాన్యాలు ఆహ్వానం పలకనున్నాయి.