సూర్య తదుపరి ప్రాజెక్ట్… ‘కంగువ’. అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ దర్శకుడు. ఈ సినిమా కోసం సూర్య అహర్నిశలూ కష్టపడుతున్నాడు. గతేడాదే ఈ సినిమా విడుదల కావాలి. కానీ… సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఈ వేసవిలో ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడొచ్చు. ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పుడు మరో హీరో ఎంట్రీ ఇచ్చాడు. తనే… కార్తీక్ ఆర్యన్. ఈ చిత్రంలో కార్తీక్ అతిథి పాత్రలో మెరబోతున్నాడు. క్లైమాక్స్ లో కార్తీక్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, తన పాత్ర ప్రవేశంతో కథ మరో మలుపు తిరుగబోతోందని టాక్.
దిశాపటానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దాదాపుగా రూ.300 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రమిది. ఇప్పుడు పార్ట్ 2 ట్రెండ్ కొనసాగుతోంది. ఈ చిత్రానికీ రెండో భాగం ఉందట. దానికి సంబంధించిన షూటింగ్ సైతం 20 శాతం పూర్తయ్యిందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.