ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బొబ్బిలిది ఓ ప్రత్యేకమైన స్థానం. అక్కడ బొబ్బిలి రాజుల కుటుంబానిదే హవా. కానీ గత ఎన్నికల్లో అక్కడ వారు ఓడిపోయారు. ఆ తర్వాత బొబ్బిలి రాజుల్లో పెద్దవాడయిన సుజయకృష్ణరంగారావు సైలెంట్ అయ్యారు. ఆయన సోదరుడు బేబినాయన యాక్టివ్ అయ్యారు. టీడీపీ తరపున ఆయనే పోటీ చేయబోతున్నారు. వైసీపీ తరపున టిక్కెట్ ఎవరికి అన్నది ఇంకా ఖరారు కాలేదు. సిట్టింగ్ ను మార్చడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రజాస్వామ్య రాజకీయాల్లో బొబ్బిలి రాజులు
బొబ్బిలి అంటే .. రాజులు, రాజ్యాలు, యుద్ధాలే కాదు.. రాజకీయంగానూ ప్రత్యేకతను దక్కించుకుంది. ఇక్కడి రాజవంశీకుల పాలన నాటి నుంచి నేటి వరకూ ఎదురులేకుండా సాగుతోంది. ప్రజాస్వామ్యంలో రాజులు ప్రజలే. దానికి తగ్గట్లుగానే బొబ్బిలి రాజులు మారిపోయి.. ప్రజాభిమానం పొందుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా మళ్లీ ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడటంతో బొబ్బిలి కేంద్రంగా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే ఉండనుంది.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న బేబినాయన
బొబ్బలి రాజ కుటుంబం తరపున రాజకీయాల్లో ఉన్న సుజయకృష్ణ రంగారావు, బేబినాయన గతంలో కాంగ్రెస్ లో ఉన్నారు. తర్వాత వైసీపీలో చేరారు. అయితే కాంగ్రెస్ లో వైఎస్, వైసీపీలో జగన్ బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీలో చేరిపోయారు. సుజయ కృష్ణ మంత్రి కూడా అయ్యారు. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడంతో అప్పటి వరకూ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఎనిమిది వేల ఓట్ల తేడాతో సజయ ఓడిపోయారు. తర్వాత ఆయన సోదరుడు బేబీనాయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆయనే పోటీ చేయడం ఖాయం.
వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత
బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. బొబ్బిలిలో ఎలాంటి పనులు జరగకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత.. బొబ్బిలిరాజులపై సానుభూతి కలిసి వస్తుందని.. ఈ సారి భారి విజయం సాధిస్తామని టీడీపీ నేతలు గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కాపు సామాజికవర్గం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీకి పదిహేను వేలకుపైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేన పార్టీ మద్దతు టీడీపీకి లభిస్తే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది.
స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన టీడీపీ
రాష్ట్రం మొత్తం ఏదో విధంగా స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ గెలిచింది. కానీ బొబ్బిలిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సుజయకృష్ణ సోదరులు క్యాడర్ ను కాపాడుకవడంతోనే అది సాధ్యమమయింది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ఈ సీటును నిలబెట్టుకోవడం సాద్యంకాదన్న వాదన వినిపిస్తోంది.