ఫాంటసీ కథలకు మంచి రోజులు వచ్చాయి. వాటికి కాస్త థ్రిల్, ఇంకాస్త మిస్టరీ జోడిస్తే పంట పండినట్టే. సందీప్ కిషన్ కొత్త సినిమా ‘ఊరు పేరు భైరవకోన’లో ఈ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. రాజేష్ దండా నిర్మాత. ఫిబ్రవరి 9న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ బయటకు వదిలారు.
లవ్ ఫీల్ తో, రొమాంటిక్ యాంగిల్ తో.. ఈ ట్రైలర్ మొదలెట్టారు. కట్ చేస్తే.. భైరవకోన అనే ఫాంటసీ ప్రపంచంలోకి కథ మళ్లుతుంది. గరుడ పురాణం నేపథ్యం, కర్మ సిద్ధాంతం.. ఇవి రెండూ కలగలిపి ఈ కథని తయారు చేసినట్టు అనిపిస్తోంది. భైరవకోన అనే ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించడానికి చిత్రబృందం బాగానే కష్టపడిందన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్… అన్నీ కట్టిపడేస్తున్నాయి. ఇటీవల వచ్చిన కాంతార, విరూపాక్ష ఎఫెక్టులు ‘భైరవకోన’లోనూ ఉన్నాయనిపిస్తోంది. ”చేతికి అంటిన రక్తాన్ని కడిగినంత సులభం కాదు.. చేసిన పాపాన్ని కడగడం” లాంటి డైలాగులు కథలోని ఇంటెన్సిటీని తెలుపుతున్నాయి. విజువల్స్ చూస్తుంటే.. నిర్మాత బాగానే ఖర్చు పెట్టి సినిమాని తీశారని అర్థం అవుతోంది. వర్ష బొల్లమ్మ, కావ్యా ధాపర్ కథానాయికలుగా నటించారు. ఆమె పాత్ర ఈ కథకు కీలకం కానుంది. రౌడీమూకని అడ్డుకొన్న షాట్ చూస్తే.. ఆ పాత్రలో ఓ ట్విస్ట్ ఉందేమో అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ట్రైలర్లో ఉన్న ఇంపాక్ట్ సినిమాలోనూ కనిపిస్తే సందీప్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిట్ పడినట్టే.