విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు వర్ధంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు అంజలి ఘటించిన కార్యక్రమం మాత్రం కాస్త వివాదస్పదమైయింది. ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి కనిపించింది. పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఫ్యాన్స్.
అనంతరం తండ్రికి నివాళులు అర్పించటానికి వచ్చారు బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య.. ”తీయించే.. ఇప్పుడే” అనే మాటలు వీడియోలో రికార్డు అయ్యాయి. దిని తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వున్న ఫ్లెక్సీలను అక్కడ సిబ్బంది తొలగించారు. ఈ పరిణామం సంచలనంగా మారింది. ‘జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలని తొలగించే చేసిన బాలయ్య’అనే కథనం దావానలంగా పాకింది.
ఈ సందర్భంగా అక్కడ అభిమానులు మధ్య కాస్త టెన్షన్ వాతావణం నెలకొంది. బాలయ్య, జూ ఎన్టీఆర్ మధ్య కొంతకాలంగా సఖ్యత లేదని, ఎన్టీఆర్ ఘాట్ వేదికగా అది మరోసారి బయటపడిందని కథనాలు వెలువరించాయి మీడియా ఛానల్స్. అయితే ఈ విషయంలో ఓ కొత్త కోణం వినిపిస్తోంది. నిజానికి బాలయ్య ఉద్దేశం ఫ్లెక్సీలు తొలగించాలని కాదట. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రాతలు బాలయ్యకి ఎబ్బెట్టుగా అనిపించాయట. శ్రద్ధాంజలి పోస్టర్స్ లో ‘స్వాగతం సుస్వాగతం’ అనే పెద్ద అక్షరాలతో రాసి ఓ అభిమాన పేరు వేయించుకున్నారట.
శ్రద్ధాంజలి కార్యక్రమానికి స్వాగతం పలకడం, పైగా అప్పుడే పుట్టుకొచ్చిన ఓ కొత్త అభిమాని ఇంత హడావిడి చేయడం.. ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ లా ఫీలయ్యారట బాలయ్య. దీంతో కేవలం ఆ రాతతో వున్న ఫ్లెక్సీ ని మాత్రమే తీసేయాలని చెప్పారట బాలయ్య. సిబ్బంది కూడా కేవలం స్వాగతం అని వున్న ఫ్లెక్సీ లని మాత్రమే తీశాయి. మిగతా ఎన్టీఆర్ ఫ్లెక్సీలన్నీ అక్కడ వున్నాయి. అయితే అసలు వాస్తవాలు ఏమిటో బయటికి వచ్చేలోగే.. తెలుగుదేశం వ్యతిరేక మీడియా ఈ అంశాన్ని చిలువలు పలువలుగా అల్లేసిందనే మాట వినిపిస్తోంది.