జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు కాపు నేతల్ని చేర్చుకోవాలని జగన్ రెడ్డి అనుకున్నారు. ఆ ఏముంది తాను చిటికేస్తే వచ్చేస్తారని అనుకున్నారు. కానీ ఆయనకు ఇప్పుడు తత్వం బోధఫడుతోంది. అంత సీన్ లేదని క్లారిటీ వస్తోంది. ఎవరూ చేరకపోగా ఉన్న వారు గుడ్ బై చెబుతున్నారు
క్రికెటర్ అంబటి రాయుడును వాడేద్దామని పవన్ ప్రభావాన్ని తగ్గిద్దామని చాలా ప్రయత్నాలు చేశారు. ఐ ప్యాక్ ఎక్సర్సైజుల తర్వాత ఆయన అధికారికంగా వైసీపీలో చేరారు. కానీ పది రోజులకే రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే పవన్ కల్యాణ్ ను కలిసిన అంబటి రాయుడు తమ వేవ్ లెంగ్త్ కలిసిందని ప్రకటించారు. దీంతో వైసీపీకి ఏడుపొక్కటే మిగిలిదింది.
ఇక పవన్ కల్యాణ్తోనే ఢీ అంటే ఢీ అన్నట్లుగా సవాళ్లు చేసిన ముద్రగడ పద్మనాభం ద్వారా పవన్ ప్రభావాన్ని తగ్గించి కాపు ఓట్లలో చీలిక తేవాలని సీఎం జగన్, వైసీపీ వ్యూహకర్తలు వైసిన ప్రణాళికలు కూడా రివర్స్ అయ్యాయి. ముద్రగడ పద్మనాభం వైసీపీకి చాలా దగ్గర. వారాహి యాత్ర సందర్భంగా తనపై పోటీ చేయాలని పవన్ కు ముద్రగడ సవాల్ చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలను తాను తిప్పికొట్టారు. జనవరి ఒకటో తేదీన వైసీపీలోకి వెళ్లే ముహుర్తం ఖరారు చేసుకున్నారు. కానీ రివర్స్ అయిపోయారు. టీడీపీ అంటేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యే ముద్రగడ.. టీడీపీలో అయినా చేరుతానని చెప్పడం వాతావరణంలో వచ్చిన మార్పును సూచిస్తోంది.
చివరికి కాపు సామాజికవర్గంలో పలుకుబడి ఉన్న వంగవీటి రాధాను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ హైకమాండ్ ప్రయత్నించింది. గతంలో వద్దనుకున్న ఆయనకు చాలా ఆఫర్లు ఇచ్చింది. ఆయన కూడా కాలితో నెట్టేశాడు. ఎలా చూసినా కీలకమైన కాపు పెద్దల్ని పార్టీలో చేర్చుకుని జనసేన పార్టీ ప్రాబల్యం వీలైనంత వరకూ తగ్గించాలని..కాపు ఓట్లలో చీలిక తీసుకు రావాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమవుతున్నాయి.