ఐఏఎస్‌లు అంటే సమాజంలో ఓ గౌరవం ఉంటుంది. కానీ జగన్ రెడ్డి పాలనలో ఐఏఎస్‌లు అంటే పరమ అవినీతి పరులు, ఐపీఎస్‌లు అంటే ప్రజల్ని పీడించేవాళ్లు, దొంగ కేసులు పెట్టే వాళ్లు అన్నట్లుగా మారిపోయింది. చివరికి దొంగ ఓట్ల స్థాయికి ఓ కలెక్టర్ దిగిపోయాడంటే.. అంతకంటే అవమానం ఏముంటుంది ?. వారికి అసలు నైతికత అనేది ఉంటే తక్షణం తమ సర్వీస్ కు రాజీనామా చేసి వెళ్లిపోవాలి. కానీ ఎప్పుడైతే నేరస్తులతో చేతులు కలిపి అడ్డగోలు పనుల చేయడానికి సిద్ధమయ్యారో.. చివరికి ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడానికి కూడా వెనుకాడలేదో అప్పుడే వారు అన్నీ వదిలేశారని అర్థమవుతుంది. వారికెవరికీ సిగ్గూ ఎగ్గూ ఉండవు. దొరికినంత దోచుకోవడమే.
తిరుపతి ఉపఎన్నికల్లో చేసిన దొంగ ఓట్ల సాయానికి గిరీషా అనే ఐఏఎస్‌కు జగన్ రెడ్డి సొంత జిల్లాలో కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది. ఇలా తప్పుడు పనులు చేసిన అనేక మందికి మంచి పోస్టింగ్‌లు వచ్చాయి. కానీ దొరికిపోయినప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్ రెడ్డి పంచన చేరి ఓ క్రిమినల్ ఆలోచనల్ని అమలు చేసిన అందరికీ శంకరగిరి మాన్యాలు పట్టే సమయం వచ్చింది. ఇవాళ గిరీష ఒక్కడే కావొచ్చు. ఆయన పాపం పండిందని అనుకోవచ్చు. మిగిలిన వారూ ఆ కలుగులో ఎంతో దాక్కోలేరు. పొగపెట్టి బయటకు తీసుకు వచ్చి మరీ వేటు వేస్తారు. దానికి ఎంతో కాలం అవసరం లేదు.. రోజుల్లోనే ఉన్నాయి.
దారి తప్పిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఏపీలో కొదవ లేదు. ఓటర్ల జాబితాలను ట్యాంపర్ చేయడం అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేయడమే. రాజ్యాంగాన్ని అవమానించడమే. ఇలాంటి పనులు చేసిన వారికి సర్వీస్‌లో ఉండే అర్హత ఉంటుందా ?. దేశ ద్రోహానికి పాల్పడిన వారికి ఐఏఎస్ అవసరమా ?. ఇలాంటి వారందరికీ బుద్ది చెబితేనే ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది. లేకపోతే.. ఏం చేసినా ఏమీ చేయలేదన్న ఉద్దేశంతో ఆ వ్యవస్థ మరింత కుళ్లిపోతుంది.