సంక్రాంతికి ఒకేసారి 5 సినిమాలు దండెత్తినప్పుడు రిలీజ్‌ల గొడవ మొదలైంది. ఫిల్మ్ ఛాంబర్ చొరవతో, సోలో రిలీజ్ డేట్ ఇస్తామన్న మాటతో `ఈగల్` సినిమా వెనక్కి వెళ్లింది. జనవరి 13న రావాల్సిన ‘ఈగల్’ ఫిబ్రవరి 9కి షిఫ్ట్ అయ్యింది. అయితే.. ఫిబ్రవరి 9న ‘ఈగల్’తో పాటుగా మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. రజనీకాంత్ ‘లాల్ సలామ్‌తో’ పాటుగా ‘యాత్ర 2’, ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాలు వస్తున్నాయి. మరి… ఛాంబర్ మాట ఏమైనట్టు? ‘ఈగల్’కి ఇస్తామన్న సోలో రిలీజ్ ఒట్టిదేనా? ఇదే విషయాన్ని ‘ఈగల్’ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందుంచింది.
ఛాంబర్ మాట విని, సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్నామని, ఫిబ్రవరి 9న విడుదల తేదీ ప్లాన్ చేసుకొన్నామని, అయితే ఆ రోజు మరో మూడు సినిమాలు వస్తున్నాయని, తమ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇవ్వాలని కోరుతూ, ఛాంబర్‌కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ లేఖ రాసింది. దీనిపై ఛాంబర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సివుంది. ‘యాత్ర 2’, ‘భైరవకోన’ నిర్మాతలతో ఛాంబర్ ఓ మీటింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ల వెర్షన్ కూడా ఛాంబర్ పరిగణలోనికి తీసుకోవాల్సివుంది. సంక్రాంతి సమయంలో ఛాంబర్ ఓ మీటింగ్ పెట్టింది. ‘ఈగల్’ వెనక్కి వెళ్తోందని, ఇచ్చిన మాట ప్రకారం ‘ఈగల్’కి సోలో రిలీజ్ ఇస్తామని మాట ఇచ్చింది. అయితే.. దానికంటే ముందే ‘యాత్ర 2’, ‘భైరవకోన’ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9న ఫిక్సయ్యాయి. ‘ఈగల్’ కి మాట ఇచ్చే ముందు ‘యాత్ర 2’, ‘భైరవకోన’ నిర్మాతల్ని సంప్రదించారా? లేదా? అనేది తెలియాల్సివుంది. ‘లాల్ సలామ్’ అనేది డబ్బింగ్ సినిమా. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు విడుదల కాకుండా అడ్డుకొన్న ఛాంబర్.. ఈసారి ‘లాల్ సలామ్’కు అడ్డుకట్ట వేయాలి. ఈ విషయంలో ఛాంబర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటుందో చూడాలి.