‘గుంటూరు కారం’ రిజల్ట్ విషయంలో నిర్మాత నాగవంశీ పోస్ట్ మార్టమ్ చేశారు. అర్థరాత్రి షోలతో నెగిటీవ్ ఇంపాక్ట్ పడిందని అభిప్రాయపడ్డారు. ఓరకంగా చెప్పాలంటే బెనిఫిట్ షోల వల్లే ఇబ్బంది వచ్చిందని చెప్పుకొచ్చారాయన. అయితే ఈ వాదనలో కొంత మాత్రమే నిజం ఉంది. గుంటూరు కారం జనవరి 12న విడుదలైంది. 11 అర్థరాత్రి నుంచి బెనిఫిట్ షోలు పడ్డాయి. సినిమా ఫలితం ఏమిటో… తెల్లారేసరికి తెలిసిపోయింది. దాంతో ఫ్యాన్స్ లో నిరుత్సాహం ఆవరించింది. నెగిటీవ్ టాక్… సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా వ్యాపించింది. పండగ రోజు కాబట్టి… వసూళ్లు బాగున్నాయి. మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం మొదలెట్టారు. క్రమంగా వసూళ్లు వచ్చాయి. అలా… ‘గుంటూరు కారం’ నెగిటీవ్ టాక్ లోనూ నిలదొక్కుకొంది.
మరోవైపు ‘హనుమాన్’ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. హనుమాన్ కూడా గుంటూరు కారంలా జనవరి 12నే వచ్చింది. 11 రాత్రి 7 గంటల నుంచే షోలు మొదలయ్యాయి. సినిమా బాగుంది. పాజిటీవ్ టాక్ సంపాదించుకొంది. తెల్లారే సరికి.. అది బ్లాక్ బస్టర్ గా మారిపోయింది. దాంతో పాటు ‘గుంటూరు కారం’కి నెగిటీవ్ రిపోర్ట్ కావడం.. ‘హనుమాన్’కి మరింత కలిసొచ్చింది. బెనిఫిట్ షోలతో ఎంత రిస్క్ ఉందో, అంతే లాభం ఉందన్న విషయం ‘హనుమాన్’ నిరూపించింది. నిజానికి ఎఫెక్ట్ బెనిఫిట్ షోలలో లేదు. కంటెంట్ లో ఉంది. కంటెంట్ బాగుంటే, బెనిఫిట్ షోలు ప్లస్ అవుతాయి. లేదంటే… మైనస్ అవుతుంది. ఈ పండక్కి వచ్చిన రెండు సినిమాలూ నిరూపించింది ఇదే.