పరిశ్రమకు పెద్ద దిక్కుగా వుండేవారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. ఏ సమస్య వచ్చిన దాసరి వద్దకు వెళ్ళేది పరిశ్రమ. ఆయన చొరవ తీసుకొని సమస్యలని పరిష్కరించేవారు. దాదాపు అందరూ ఆయన మాట వినేవారు. ఆయన మరణం తర్వాత పరిశ్రమకు పెద్ద దిక్కు లోటు అలాగే ఉండిపోయింది. ఆయన తర్వాత చిరంజీవి పెద్ద దిక్కుగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏదైనా సమస్య వుంటే కొన్నాళ్ళు చిరంజీవి వద్దకు వెళ్ళడం, ఆయన చొరవ తీసుకొని వాటి పరిష్కరించడం చూశాం. అయితే మళ్ళీ దీనిపైనే ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయలు వ్యక్తమైయ్యాయి. సీనియర్ నరేష్ లాంటి నటుడు ఇండస్ట్రీ పెద్ద దిక్కు బాధ్యత మోహన్ బాబు తీసుకుంటే బావుటుందని మా ఎన్నికల సమయంలో చెప్పడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో సహజంగానే వివాదరహితుడైన చిరు.. ”నేనేం పెద్ద దిక్కు కాదు…. పరిశ్రమ బిడ్డగా అవసరం వున్నప్పుడు నా వంతు సాయం చేయడానికి మాత్రం ఎప్పుడూ ముందు వుంటాను’ అని చెప్పి అక్కడితో ‘పెద్ద దిక్కు’ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఈ సంక్రాంతికి పరిశ్రమ సినిమాల విడుదల సమస్యని ఎదుర్కుంది. ఐదు సినిమాలు ఒకేసారి రావడానికి సిద్ధం కావడంతో థియేటర్స్ సమస్య ఏర్పడింది. దీనిపై కూడా చిరంజీవి స్పందించలేదు. హనుమాన్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన ఆయన బావున్న సినిమా ఆడుతుందని చెప్పారు తప్పితే సమస్య జోలికి వెళ్ళలేదు. అయితే ఈ సమస్యని పరిష్కరించడానికి నిర్మాతలతో కలసి ఛాంబర్ పెద్దలే పెద్దరికం తీసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. వాయిదా వేసుకున్న చిత్రానికి సోలో రిలీజ్ డేట్ ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రవితేజ ఈగల్ ఫిబ్రవరి 9కి వాయిదా వేసుకుంది. అయితే ఇప్పుడు ఈగల్ కి సోలో రిలీజ్ డేట్ లేదు. ఆ డేట్ కి ఊరు పేరు భైరవకోన, యాత్ర2, రజనీకాంత్ లాల్ సలాం లాంటి చిత్రాలు విడుదలౌతున్నాయి. దీంతో సహజంగానే ఈగల్ నిర్మాణ సంస్థ ఛాంబర్ లేఖ రాసింది.
ఒక పెద్ద సినిమా నెల పాటు వాయిదా వేసుకోవడం మామూలు విషయం కాదు. వడ్డీలు చుక్కలు చూపిస్తాయి. పైగా ఈగల్ సంక్రాంతి విడుదలకు ప్రమోషన్స్ అన్నీ చేసుకుంది. టీజర్ ట్రైలర్ పాటలు.. ఇలా అన్నీ ఈవెంట్లు పెట్టి మరీ వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేయడానికి బోలెడు ఖర్చు. ఈ లెక్కలు, బిజినెస్ మాట పక్కన పెడితే.. నలుగురు నిర్మాతలు, ఛాంబర్ పెద్దలు కలసి తీసుకున్న మాట నిలబడటం పరిశ్రమకు చాలా ముఖ్యం. భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. వాటిని పరిష్కరించే సందర్భంలో ఒక మాట ఇచ్చినపుడు ఆ మాట నిలబెట్టుకోగలిగితేనే క్రెడిబిలిటీ వుంటుంది. అలా కాకుండా ఏరు దాటాక తెప్ప తగలేసే రకంగా వ్యవహరిస్తే మాత్రం.. పరిశ్రమకే చేటు.