పూర్తిగా అధికారం పోకుండానే జగన్ సర్వీస్ అధికారులు శంకరగిరి మాన్యాలకు పట్టడం ప్రారంభించారు. ఐఏఎస్లు.. ఐపీఎస్లు ఈ జాబితాలో ఉన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో అక్రమాలకే నలుగురు, ఐదుగురు సివిల్ సర్వీస్ అధికారులు కేసుల్లో ఇరుక్కుని సర్వీసులో తీవ్రంగా నష్టపోబోతున్నారు. వీరిని అధికారంలో ఉన్న జగన్ రెడ్డి కూడా కాపాడలేకపోతున్నారు. ఆయనదాకా వస్తే మాకేం సంబంధం లేదని తప్పించుకుంటారు. చివరికి ఆ తప్పుడు పనులు చేయించిన వారు కూడా.. అంతా తప్పు సివిల్ సర్వీస్ అధికారులదే అంటారు.
ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారంపైనా విచారణ జరిగే అవకాశం ఉంది. అప్పుడు కూడా మరికొంత మంది సివిల్ సర్వీస్ అధికారులు ఇంటి బాట పట్టనున్నారు. ఎవరూ తప్పించుకునే అవకాశం ఉండదు. ఇదంతా తమతో తప్పులు చేయించిన వారు పవర్ లో ఉన్నప్పుడే జరుగుతోంది. అదే వారి పవర్ ప్రజలు పీకేసిన తరవాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. జగన్ రెడ్డి సర్వీస్ లో మునిగి తేలి .. ప్రతిపక్ష నేతల్ని వేధించడానికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ప్రతీ ఒక్కరికీ శంకరగిరి మాన్యాల దారి చూపించడం ఖాయమే. అడ్డగోలుగా తప్పులు చేసి రాజకీయ బాసుల అవసరాలు తీరిస్తే.. తర్వాత తమను రక్షించడానికి వారు కూడా ముందుకు రారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
గతంలో జగన్ రెడ్డి పదవిలోకి రాక ముందే శ్రీలక్ష్మి వంటి ఎంతో భవిష్యత్ ఉన్న వారి జీవితాలతో ఓ ఆట ఆడుకున్నారు. అయితే అలాంటి అధికారులకు కనీసం ప్రాయశ్చిత్తం లేకుండా మళ్లీ జగన్ రెడ్డి పంచన చేరి ఆయన చెప్పినట్లుగా చేయడమే ఆశ్చర్యకరం. ఇలాంటి జగన్ రెడ్డి సర్వీస్ అధికారులు ఉన్నంత కాలం వ్యవస్థ మారదు. బలయ్యేవారూ ఎప్పుడూ ఉంటారు. చేసుకున్న వారికి చేసుకున్నంత. వీరు చేసిన పనుల వల్ల తర్వాత వీరికి కనీస సానుభూతి కూడా లభించద. ఎవరి వద్ద నుంచి సపోర్టు కూడా రాదు.